Carpenter ants: మనిషి రికార్డ్ బద్దలు.. సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన చీమలు

Carpenter ants: మనిషి రికార్డ్ బద్దలు.. సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన చీమలు


‘చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్’ ఈ పద్యం మీకు తెలుసుగా..! చీమలన్ని(Carpenter ants) ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్టను పాములు ఆక్రమించుకుంటాయన్నది దీని సారాంశం..!

ఈ పద్యంతో చీమలు ఎంత కష్టజీవులో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపై చీమలు అంటే కష్ట జీవులే కాదండోయ్..! అవి సర్జన్లు కూడా..! తోటి చీమలు గాయపడినా.. శస్త్రచికిత్స చేసి గాయాన్ని మాన్పగలే సామర్థ్యం వాటికి ఉంటుంది. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

మాటాబెలే, మెగాపోనెరా అనే విభిన్న చీమల జాతులపై జరిపిన పరిశోధనలు ఆసక్తికర ఫలితాన్నిచ్చాయి. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ఉర్జ్‌బర్గ్ శాస్త్రవేత్తలు ఈ రిసర్చ్ జరిపారు. అలా భూమి మీద మనిషి తరువాత శస్త్రచికిత్స చేసే రెండో జీవిగా చీమను గుర్తిస్తున్నట్లు శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రాంక్ చెప్పారు. మనుషుల్లా సర్జరీ పరికరాలు, మందులు అక్కర్లేకుండానే చీమలు సర్జరీ చేసి మనుషుల రికార్డును బద్దలు కొట్టాయన్నమాట.

రిసర్చ్ జరిగిందిలా..

ఒక రిసర్చర్ ఓ చీమ కుడి తొడ కింది భాగంలో కోశారు. తరువాత దాన్ని వదిలేయగా.. దాని చుట్టూ 20 వరకు చీమలు గుమిగూడాయి. గాయపడిన చీమకు యూనివర్సిటీ ఆఫ్ ఉర్జ్ బర్గ్ శాస్త్రవేత్తలు మైక్రో కెమెరాలు అమర్చారు. దాన్ని తోటి చీమలు దగ్గర్లోని పుట్టలోకి తీసుకెళ్లాయి. రక్తం రాకుండా నోటిలోని లాలాజలాన్ని గాయంపై పూశాయి. తరువాత గాయం శరీరమంతా పాకకుండా తొడను శరీరం నుంచి వేరు చేశాయి. గాయపడ్డ తొడను అదేపనిగా కొరకడంతో తొడ భాగం వేరుపడింది. శరీరం నుంచి తొడ వేరుపడగానే, మళ్లీ లాలాజలాన్ని గాయంపై ఉంచడంతో.. రక్త స్రావం ఆగిపోయింది. ఇదంతా కేవలం 40 నిమిషాల్లో చేయడంతో చీమ సాధారణ స్థితికి చేరుకున్నట్లు పరిశోధనలో తేలింది. అలా సర్జరీ చేసి చీమలు ఓ ప్రాణాన్ని కాపాడాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వివరాలన్నింటినీ కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు.