అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైందని వార్తలు వస్తున్నా… అసలు ఆయన చేసిన నేరం ఏమిటనేది పలువురికి అర్థంకాని ప్రశ్నం. ఎందుకంటే భారత్‌లో ఏపీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇస్తే అమెరికాలో అదానీపై ఎలా కేసు పెడుతారు?
ఎందుకు పెడతారనేది చాలా మంది అడుతున్న ప్రశ్న. వాస్తవానికి అదానీపై రెండు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. ఒకటి అమెరికా న్యాయ విభాగం, రెండోది అమెరికా స్టాక్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్. ఈ రెండు సంస్థలు చేస్తున్న అభియోగాలు ఒకటే కాని భిన్నమైనవి. తమ దేశంలో తప్పుడు సమాచారంతో… వాస్తవాలను మరుగుపర్చి వేల కోట్ల రూపాలను అదానీ కంపెనీ సమీకరించిందనేది రెండు సంస్థల ప్రధాన అభియోగం. అమెరికా చట్టాల ప్రకారం విదేశాల్లో కూడా ముడపులు, లంచాలు ఇచ్చి వ్యాపారాలు చేయడం, కాంట్రాక్ట్‌లు పొందడం చట్ట విరుద్ధం. అలాంటి పనులు చేసే కంపెనీలు… లంచాలు ఇవ్వడమే కాదు.. అందుకోసం తమ దేశ ఫోన్లను, వ్యవస్థలను వాడుకున్నా కేసు పెడుతారు.
ముందుగా స్టాక్స్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగం తీసుకుందాం. గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు రాజేష్ అదానీలు కలిసి అదానీ గ్రీన్ అనే కంపెనీని భారత్‌లో నెలకొల్పారు. కొన్నేళ్ళకు రాజేష్ అదానీ కుమారుడు సాగర్ అదానీ కంపెనీలో చేరాడు. ఈ కంపెనీ తమ వ్యాపార విస్తరణ కోసం అమెరికాలో బాండ్ల జారీ ద్వారా 75 కోట్ల డాలర్లను సమీకరించాలని నిర్ణయించింది.ఈ బాండ్స్‌ను నోట్స్ అని కూడా అంటారు. ఈ నోట్స్‌ను 2021 సెప్టెంబర్‌లో అమ్మారు. దీని కోసం అమెరికాలోని పలు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. సాధారణంగా నిధుల సమీకరణ సమయంలో కంపెనీలు ఈ రోడ్ షోలను నిర్వహించి ఆసక్తిగత ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తారు. తమ కంపెనీ గొప్పతనం వివరించి నిధులు సమీకరిస్తారు. అలాగే నిధులు సమీకరించింది అదానీ గ్రీన్. అయితే అమెరికా అధికారులు జరిపిన దర్యాప్తులో అదానీలు ముడుపులతో కాంట్రాక్ట్‌లు పొందారని తేల్చారు. అంటే మోసపూరిత మాటలు, వాగ్ధానాలతో తమ ఇన్వెస్టర్లను మోసం చేశారని స్టాక్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది. ముడుపులు గురించి పూర్తి వివరాలను తమ అభియోగ పత్రంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ అధికారులకు విద్యుత్ సరఫరా కాంట్రాక్ట్‌లు పొందారని, అయితే అధిక ధరకు సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా వివిధ రాష్ట్రాల డిస్కమ్‌లను ఒప్పించారన్నది ప్రధాన ఆరోపణ. దీని కోసం డిస్కమ్ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారీ మొత్తం అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఏపీ సీఎంకు ఇచ్చిన/ఇవ్వబోయే లంచాల గురించి అదానీ ఎనర్జి, మరో విద్యుత్ కంపెనీ అజూర్ పవర్ మధ్య సాగిన కమ్యూనికేషన్స్‌లో బయటపడిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అజూర్ పవర్ కంపెనీ కూడా విద్యుత్ కాంట్రాక్ట్‌ల కోసం లంచాలు ఇచ్చింది. అదానీ కుదర్చిన డీల్స్‌లో వీరికి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ మారిషస్ కంపెనీలో కెనడాకు చెందిన రెండు పెన్షన్ ఫండ్స్ పెట్టుబడి పెట్టాయి. పైగా ఈ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయి ఉంది. 2023 నవంబర్ వరకు లిస్టింగ్‌లో ఉన్నట్లు తేలింది. అంటే లిస్టింగ్ కంపెనీ విదేశాల్లో లంచాలు ఇచ్చిందన్నమాట. ఇది కూడా అమెరికా చట్టాలకు విరుద్ధం.
ఇక న్యాయ శాఖ
అమెరికాతో పాటు మన దేశంలో హాట్‌టాపిక్‌గా మారిన మరో అభియోగ పత్రం దాఖలు చేసింది అమెరికా న్యాయ శాఖ. ఎఫ్‌బీఐతో విచారణ జరిపించి… ఆధారాలతో సహా ఈ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి 200 కోట్ల డాలర్లను, బాండ్లను అమ్మి మరో 100 కోట్ల డాలర్లను అదానీ కంపెనీ సేకరించిందని న్యాయ శాఖ ఆరోపించింది. లంచాలు, ముడుపులకు తాము వ్యతిరేకమని చెప్పి… అదానీ కంపెనీ నిధులను సమీకరించిందని అభియోగ పత్రంలో పేర్కొంది. అయితే తాము జరిపిన దర్యాప్తులో అదానీలు రూ. 2000 కోట్లకు పైగా లంచాలు ఇచ్చారని తెలిపింది. అందులో రూ. 1750 కోట్ల లంచం సంబంధించి అప్పటి ఏపీ సీఎంకు, అదానీ మధ్య చర్చలు జరిపినట్లు పేర్కొంది. అదానీ స్వయంగా ఏపీకి వచ్చి డీల్ చేసుకున్నారని, ఆ తరవాత అహ్మదాబాద్‌లో జరిగిన అదానీ గ్రీన్ బోర్డు సమావేశంలో ఈ లంచాల ప్రస్తావన వచ్చిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ కంపెనీల అధికారులకు కూడా అదానీలు లంచాలు ఇచ్చారని తెలిపింది.
అయిదు నేరాలు
ఎఫ్‌సీపీఏ సహా…
మొత్తం అయిదు రకాల నేరాల కింద అదానీలపై కేసులు నమోదు అయ్యాయి. ప్రధానమైంది నిబంధనలకు విరుద్ధంగా నిధులు సమీకరించడం, రెండోది తమ దేశ ఇన్వెస్టర్లను మోసం చేయడం. ఇక మూడో అభియోగం తమ టెలికాం వ్యవస్థను దీని కోసం వాడటం. అలాగే 2021 144A బాండ్ల జారీ అంశంలో సెక్యూరిటీ యాక్ట్‌ను ఉల్లంఘించడం. ఇక చివరి అభియోగం… దర్యాప్తుకు విఘాతం కల్గించడం.
జగన్‌పై కేసు…
నిధుల సమీకరణ విషయంలో అదానీ గ్రూప్ వ్యక్తులు తమ దేశ ఇన్వెస్టర్లను మోసం చేశారన్నది అమెరికా ఆరోపణ. దీని కోసం తమ వ్యవస్థలను ఉపయోగించారని.. దీనిపై చర్యల కోసం చార్జిషీటు వేశారు. అయితే తమ ఇన్వెస్టర్లను ఎలా మోసం చేశారో వివరించే క్రమంలో ముడుపులు వ్యవహారాన్ని ప్రస్తావించింది న్యాయ శాఖ. అందులో అప్పటి ఏపీ సీఎం గురించి ప్రస్తావించింది. దానికి సంబంధించిన ఆధారాలను కేసులో ప్రస్తావించింది. మిగిలిన ఆధారాలను విచారణ సమయంలో ప్రస్తావిస్తారేమో చూడాలి. సో… నిజంగా జగన్మోహన్‌రెడ్డి లంచాలు తీసుకున్నారా? తీసుకుంటే ఎలా తీసుకున్నారు? ఆ మొత్తం ఎక్కడ ఉంది… వంటి అంశాలను భారత అధికారులు తేల్చాల్సి ఉంది.