ACB Raids: కట్టలు కట్టలుగా నగదు పట్టవేత.. 18 చోట్ల సోదాలు, 200 కోట్ల ఆస్తులు గుర్తింపు

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్‌ ఇల్లు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించారు.


ఈ దాడుల్లో అక్రమ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. ఏసీబీ బృందాలు ఒకేసారి 18 చోట్ల సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించి ఇంకా అంబేద్కర్, ఆయన బినామీలు, బంధువులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు రూ. 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రతి పనికి లంచం తీసుకునే అలవాటు అంబేద్కర్‌కు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

గచ్చిబౌలిలో ఉన్న అంబేద్కర్‌ బినామీ సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ. 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గచ్చిబౌలిలో ఒక ఖరీదైన భవనాన్ని కూడా గుర్తించారు. అంతేకాకుండా, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో అంబేద్కర్‌కు 10 ఎకరాల వ్యవసాయ భూమి, వెయ్యి గజాల్లో ఫామ్‌హౌస్‌ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో లభించిన వ్యవసాయ భూముల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు భాగం పంచుకున్నారనే దానిపై విచారణ కొనసాగుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.