కుల గణన: ఫిబ్రవరి 2027లో జనాభా మరియు కుల గణన

తొలి దశలో అడిగే ప్రశ్నిలివే..


  • ఇంటి నంబరు.
  • ఇంటి ఫ్లోర్, గోడలు, పైకప్పు నిర్మాణంలో ఏ మెటీరియల్‌ ఉపయోగించారు.
  • ఇంటి పరిస్థితి ఎలా ఉంది..
  • కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు.. ఇంటి పెద్ద పేరు, వారు ఆడా.. మగా.
  • ఇంటి పెద్ద కులం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ).
  • ఇంటి యాజమాన్య వివరాలు.
  • ఇంట్లో ఉంటున్న నివాస గదులెన్ని..
  • ఆ ఇంట్లో ఉంటున్న వివాహమైన జంటలు
  • తాగు నీటికి ప్రధాన వనరు ఏంటి..
  • విద్యుత్తు, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉన్నాయా.. ఎలాంటి మరుగుదొడ్డి వాడుతున్నారు..
  • వృథా నీరు వెళ్లడానికి కనెక్షన్‌ ఉందా..
  • ఇంటి పరిధిలోనే స్నానాల గది ఉందా..
  • వంటశాల లభ్యత, వంటకు ఉపయోగిస్తున్న ఇంధనం.
  • ఎలాంటి తృణ ధాన్యాలను వినియోగిస్తున్నారు..
  • రేడియో/టీవీ/ఫోన్‌/మొబైల్‌/ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉందా..
  • కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌ వినియోగిస్తున్నారా..
  • కారు, జీప్, వ్యాన్, స్కూటర్, మోటార్‌ సైకిల్, మోపెడ్‌ ఉందా..
  • బ్యాంకింగ్‌ సేవలను వాడుకుంటున్నారా..

రెండోదశలో..

  • వ్యక్తి పేరు, ఇంటి యజమానితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, జన్మ స్థలం, వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలున్నారు.
  • మతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషలపట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, చేస్తున్న పని, గత ఏడాది కాలంలో చేసిన పని, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పని చేస్తున్నారు.

వ్యాపారమా.. లేదంటే ఉద్యోగమా, చివరిగా నివసించిన ప్రాంతం, వలసకు కారణం, ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఎంతకాలం నుంచి ఉన్నారు.

 

దేశ 16వ జన గణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటే కుల గణననూ చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్‌ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జన గణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్‌లోనే తొలి విడత హౌస్‌ లిస్టింగ్‌ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్ధాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2026 సెప్టెంబరు ఆఖరు నాటికే జన గణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబరు 1ని రెఫరెన్స్‌ తేదీగా ప్రకటించింది. జనాభా లెక్కల చట్టం-1948లోని (సెన్సస్‌ యాక్ట్‌-1948) సెక్షన్‌ 3 నిబంధనల ప్రకారం.. ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజిట్‌లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జన గణన జరగాల్సి ఉంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ఇన్నాళ్లకు మళ్లీ కొత్త షెడ్యూలు వచ్చింది. పదహారు ఏళ్ల తర్వాత జన గణన జరగనుంది. ఇదివరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలనూ ప్రత్యేకంగా సేకరించనుంది. కుల గణనకు ఏప్రిల్‌ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

  • జనాభా లెక్కలతోపాటే జాతీయ జనాభా రిజిస్టరును (ఎన్‌పీఆర్‌) అప్‌డేట్‌ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. 2020లో జన గణన సమయంలో మాత్రం ఎన్‌పీఆర్‌ అప్‌డేట్‌ వెంటనే జరుగుతుందని పేర్కొంది. కానీ కొవిడ్‌తో జన గణనే జరగలేదు.
  • 2027లో జన గణనకు రూ.13,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2021లో చేపట్టాలనుకున్న జన గణనకు 2019 డిసెంబరు 24న జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. జన గణనకు రూ.8,754 కోట్లు, ఎన్‌పీఆర్‌ అప్‌డేట్‌కు రూ.3,941 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.
  • జన గణన రిజిస్ట్రార్‌ జనరల్‌కు కేంద్ర ప్రభుత్వం.. 2025-26 బడ్జెట్‌లో కేవలం రూ.574 కోట్లే కేటాయించింది. అయితే జనాభా లెక్కల సేకరణకు నిధుల కేటాయింపు పెద్ద సమస్య కాదని అధికారులు అంటున్నారు.
  • దాదాపు 30 లక్షల మంది సిబ్బంది ఈ జన గణనలో పాలుపంచుకుంటారు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 121.01 కోట్లు. ఇందులో 62.3 కోట్ల మంది (51.54%) పురుషులు. 58.6 కోట్ల మంది (48.46%) మహిళలు.
  • బ్రిటిష్‌ హయాంలో 1881 నుంచి 1931 వరకూ కుల గణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక, ఆర్థిక, కుల గణన జరిగింది. అయితే ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు.
  • తెలంగాణ, బిహార్‌లు సొంతంగా కుల గణన ఇప్పటికే నిర్వహించాయి. అయితే కేంద్రం ఈ రాష్ట్రాల్లోనూ మళ్లీ నిర్వహించనుంది.
  • చివరి జన గణనను 2011లో రెండు దశల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.

నియోజకవర్గాల పునర్విభజన కోసమే!

రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం జనగణనను 2027లో నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి.. ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 82, 170 చెబుతున్నందున ఈ దిశగా అడుగులేస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణంతా ట్యాబ్‌ల ద్వారా డిజిటల్‌ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశముంది. ఉమ్మడి ఏపీ విభజనచట్టంలోని సెక్షన్‌ 26లో.. ఏపీ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారు. అయితే ఇది ఆర్టికల్‌ 170కి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ ఆర్టికల్‌లో 2026 తర్వాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాకే పునర్విభజన చేపట్టాలన్న నిబంధన ఉండటంతో కేంద్రం ఈ విషయంలో ముందుకెళ్లలేదు. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇటీవలే విచారణ ముగించి తీర్పు రిజర్వు చేసింది.

3 డజన్ల ప్రశ్నలు: జనగణన రెండు దశల్లో కేంద్రం ప్రజల నుంచి విభిన్న అంశాలపై వివరాలను సేకరించనుంది. ఇందుకోసం దాదాపు 3 డజన్ల ప్రశ్నలు వేయనుంది. వీటి ఆధారంగానే సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయనుంది.

జనాభా అంచనాలివీ..

2020 జులైలో జన గణన విభాగం విడుదల చేసిన అంచనాల ప్రకారం.. 2027 నాటికి దేశ జనాభా దేశ జనాభా 143,64,78,000. వివిధ రాష్ట్రాల జనసంఖ్య అంచనా వివరాలు

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.