CBSE New Rules : సీబీఎస్ఈ పరీక్షలో మార్పులు చేసిన బోర్డు.. ఇకపై అలాంటి స్టూడెంట్స్ కి చుక్కలే!

దేశవ్యాప్తంగా 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు జరగనున్న తరుణంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో చూచి రాతలు, బయట నుంచి కాఫీలు అందే విధానాలకు చెక్ పెట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది.


సీబీఎస్ఈ సబ్జెట్స్ బోధించే అన్ని పాఠశాలలు ఈ విధానాల్ని తప్పనిసరిగా అమల్లో పెట్టాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ జాగ్రత్తల వల్ల పరీక్షల్లో అక్రమాలు, మోసాన్ని అరికట్టేందుకు వీలవుతుందని బోర్డు అభిప్రాయపడింది. ఇంతకీ.. తాజాగా వచ్చిన మార్పులేంటి.. వీటితో విద్యార్థులు, బడులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..

విద్యార్థులు స్వతహాగా వారి తెలివితేటలతో పరీక్షల్లో పాల్గొనాలి. అలా.. ఎవరి కష్టానికి తగ్గట్లు వారు తర్వాతి తరగతుల్లో ప్రయోజనం పొందాలి.. అందుకే CBSE ఆన్సర్ షీట్ లో ఈ ఏడాది 2025 నుంచి గణనీయమైన మార్పులను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని.. పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్థి ఈ మార్పుల గురించి తెలుసుకోవాలని సూచించింది. CBSE బోర్డు పరీక్ష 2025 ను మరింత పారదర్శకంగా మార్చేందుకు, పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఆన్సర్ షీట్లల్లో కీలక మార్పులు చేసింది.

ఆన్సర్ షీట్స్ లో ప్రత్యేక QR కోడ్‌

ఇకపై సీబీఎస్ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎవరి సమాధాన పత్రానికి వారికే ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండనుంది. దీని ద్వారా ఆయా విద్యార్థుల పేపర్ ట్రాకింగ్ మరింత సులువు కానుంది. అలాగే. పరీక్షల సమయంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా నిరోధించేందుకు సహాయపడుతుందని అంటున్నారు. అలాగే.. విద్యార్థులు ప్రశ్నలకు సంబంధించిన సంఖ్యలను ఆన్సర్ షీట్ లోని మార్జిన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మధ్యలో, కుడి వైపు మార్జిన్లలో రాస్తే చెల్లదని బోర్డు తెలిపింది.

ప్రశ్నాపత్రంపై మార్కింగ్ చేయడం, రాయడం వంటివి చేస్తే కాఫీ కింద పరిగణించాల్సి ఉంటుందని బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు క్వశ్చన్ పేపర్ పై ఎలాంటి నంబర్లు, రాయలు చేయొద్దని స్పష్టం చేసింది. ఏవైనా ప్రాక్టీస్ వర్క్, రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటే.. ఆన్సర్ షీట్ కు కుడివైపున ఉన్న మార్జిన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుందని, అలా కాదని, పేపర్ మధ్యలో, ఎడమవైపు మార్జిన్ లేదా.. మరెక్కడైనా చేస్తే చర్యలుంటాయని, అలాంటి పేపర్ల మూల్యాంకనం చేపట్టమని స్పష్టం చేసింది. దీంతో.. ఆన్సర్ షీట్లు మరింత స్పష్టంగా, పేపర్లు దిద్దే ఉపాధాయ్యులకు అర్థం అయ్యేలా ఉంటుందని అభిప్రాయపడింది.

పరీక్షల్లో పాసయ్యేందుకు, మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు తప్పుడు విధానాలు అవలంభిస్తే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీబీఎస్ఈ బోర్డు హెచ్చరించింది. అన్యాయమైన పద్ధతులను సహించగదంటూ వెల్లడించింది. మోసం చేయడం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం సహా ఇంకా ఏవైనా దుష్ప్రవర్తనలకు పాల్పడినట్లు తేలితే.. విద్యార్థులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏవైనా చట్టవిరుద్ధమైన పద్ధతులు అవలంభిస్తున్నట్లు తేలితే.. వెంటనే పరీక్షలు రాకుండా రద్దు చేస్తారు. మరో రెండేళ్ల పాటు CBSE పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తారు.

CBSE 2025 పరీక్షల వివరాలు

CBSE 10, 12 తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ 2025 ఫిబ్రవరి 15 న ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 204 సబ్జెక్టులలో దాదాపు 44 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా.. పరీక్షలన్నింటినీ ఒకే షిఫ్ట్ లో నిర్వహించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన మార్గదర్శకాలతో పరీక్షలు మరింత సజావుగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. సీబీఎస్ఈ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… 10వ తరగతి పరీక్షలు.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నారు. అలాగే.. సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.

సీసీ టీవీ కెమెరాలు తప్పనిసరి

సీబీఎస్ఈ పరీక్షను మరింత నమ్మకమైన, సురక్షితమైన పరీక్షగా మార్చేందుకు.. అన్నీ పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ టీవీలు ఏర్పాటు చేయాలంటూ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అలాగే.. ఎంపిక చేసిన ప్రదేశాలలోని సీసీ టీవీలు లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తెలుపుతోంది. ఈ చర్యల ఫలితంగా పరీక్షల విశ్వసనీయత పెరుగుతుందని అంటున్నారు.