2029కి నియోజకవర్గాల పునర్విభజన లేనట్టే.. తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్రం.. వీళ్ల ఆశలన్నీ అడియాసలే

www.mannamweb.com


Redistribution Of Constituencies: తెలుగు రాష్ట్రాల్లో 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదు. కేంద్ర బడ్జెట్లో జన గణనకు సంబంధించి కేటాయింపులు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. జన గణన పూర్తయితే గానీ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఉండదు. చివరిసారిగా దేశంలో 2011లో జనగణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2021లో జనగణన చేయలేదు. కరోనా తో పాటు ఇతరత్రా కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తరువాత చేపట్టేందుకు సైతం ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. అటు కేంద్ర బడ్జెట్లో సైతం జన గణన ప్రక్రియకు అంతంత మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2006 నుంచి అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. సకాలంలో పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న లోక్ సభ స్థానాలను భారీగా పెంచుతూ పునర్విభజన చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని విభజన చట్టంలో పేర్కొన్నారు. దీంతో అందరూ 2029 ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనగణన జరగలేదు. కుల గణన ముందుకెళ్లలేదు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. కానీ వివిధ రాజకీయ పార్టీల నేతలు మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పై ఆశలు పెట్టుకున్నారు.

* రెట్టింపు అసాధ్యం
దేశవ్యాప్తంగా543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజనతో ఇవి రెట్టింపు అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ స్థానాలు 52 కి, తెలంగాణలో ఉన్న 17 స్థానాలు 39కి పెరుగుతాయి అన్నది చర్చ. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏపీలో ఉన్న 175 సీట్లు కాస్త 225, తెలంగాణలో ఉన్న 119 సీట్లు కాస్త 153 అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది చర్చ.2014లో రాష్ట్ర విభజన సమయంలో..దేశంలో ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన చేపడుతామని విభజన చట్టంలో పొందుపరిచారు. 2026 తర్వాత పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

* జాడలేని జనగణన
అయితే ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో జనగణన చేపట్టలేదు. కుల గణన పూర్తి కాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జన గణనకు కేంద్రం కేవలం రూ. 1309 కోట్లు మాత్రమే కేటాయించింది.2021-22 రెండులో అయితే జనగణనకు కేంద్రం 3768 కోట్లు కేటాయించింది. ఇప్పుడు అందులో సగం కూడా కేటాయించలేదు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా లేదని తెలుస్తోంది. జనగణనకు ఈ మొత్తం చాలదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

* విభజన చట్టంలో పేర్కొన్నా
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతుంది. 2029 నాటికి 15 సంవత్సరాలు గడుస్తాయి.కానీ విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన పెంపు మాత్రం జరగలేదు. కొద్ది రోజుల క్రిందట లిఖితపూర్వకంగా చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అనేది దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.