రేషన్‌కార్డు.. మన దేశంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి.. వారి కనీస అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు రేషన్‌కార్డులను మంజూరు చేస్తాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే, అమలు చేసే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డే కొలమానం. అది ఉంటేనే అర్హులవుతారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అందుకోవాలంటే.. రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేస్తుంటాయి. ఇక తెలంగాణలో గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా మంజూరు కాలేదు. ఇక 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త రేషన్‌కార్డుల మంజూరు చేస్తామని చెప్పింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రేషన్‌కార్డుదారులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
రేషన్‌కార్డుదారులకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వీటి ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు అందించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతకాక రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి తాజాగా పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఉత్తప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 60 రేషన్ షాపులను ఎంపిక చేసుకుంది. ఈ జన్‌పోషణ్ కేంద్రాల ద్వారా.. పాల ఉత్పత్తులు, పప్పులు, రోజువారీ నిత్యావసర సరుకులు సహా.. మొత్తంగా 3500 ఉత్పత్తులను.. తక్కువ ధరకే అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను అందించడమే కాక.. ఎక్కువ ఉత్పత్తులను విక్రయించినందుకు రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ కూడా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. ‘‘రేషన్‌కేంద్రాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాము. వీటి ద్వారా రేషన్‌కార్డు దారులకు తక్కువ ధరకే పోషకాహారం అందించడంతో పాటు.. రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీని కోసం దేశంలోని 4 రాష్ట్రాల్లో ఉన్న 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు’’గా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న రేషన్ దుకాణాలు నెలకు 8-9 రోజులు మాత్రమే పని చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే.. కేవలం 3 నెలలకు ఒక్కసారి మాత్రమే పని చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు. మిగిలిన రోజుల్లో రేషన్‌దుకాణాలు మూతపడి ఉంటున్నాయని.. దాంతో రేషన్ డీలర్లకు వస్తోన్న కమీషన్లు సరిపోవట్లేదని.. అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని.. అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ఇక జన్ పోషణ్ కేంద్రాల్లో పప్పులు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎఫ్‌ఎంసీజీ విభాగంలోని సుమారు 3500 సరుకులను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.