– ట్రంప్ టారీఫ్ల ఊసే లేదు- లెక్కలేని రూపాయి పతనం..
– ఏఐపై విస్మరణ
– మరోవైపు పని గంటల పెంపు
– జీడీపీ పెరుగుదలకు చర్యలు శూన్యం
ఎకనామిక్ సర్వే వెల్లడి
దేశ ఆర్థిక స్థితికి అద్దం పట్టే అధికారిక వార్షిక నివేదిక ఎకనామిక్ సర్వేలో అనేక సవాళ్లను మోడీ సర్కార్ విస్మరించింది. అంతర్జాతీయంగా ట్రంప్ టారీఫ్ల పెంపు, ఎగుమతుల పతనం, వాణిజ్య లోటు సమస్యలకు పరిష్కారం చూపలేదు. మరోవైపు రికార్డ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువపై లెక్కలేని తనంగా వ్యవహరించింది. ఎకనామిక్ సర్వేలో ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలను పొందుపర్చాలి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రధాన మార్పులు, పరిణామాల్ని చెప్పి.. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో మార్గదర్శనం చేయాలి. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరించాలి. విదేశీ భౌగోలిక, ఆర్ధిక పరిణామాల ప్రభావం, ప్రభుత్వ విధాన నిర్ణయాలను విశ్లేషించాలి. దీని ఆధారంగానే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంటుంది. కానీ దీనికి భిన్నంగా దిశానిర్దేశం లేని ఎకనామిక్ సర్వేను బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో అనేక సవాళ్లు, పరిష్కారాలకు నీళ్లు వదిలేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో జీడీపీ 6.4 శాతానికి పడిపోయి.. నాలుగేండ్ల కనిష్టానికి చేరొచ్చని అంచనా వేసిన ఆర్థిక సర్వే.. వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించలేదు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత్పై సుంకాలను పెంచుతామని బహి రంగంగా ప్రకటించారు. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డ్ స్థాయిలో 87కు చేరువలో పతనమయ్యింది. ఎగుమతులు పతనం అవుతున్నాయి. వాణిజ్య లోటు పెరుగుతోంది. అనేక రంగాలు మౌలిక వసతుల సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు, అసంఘటిత రంగం కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల, మందగిస్తున్న పరిశ్రమల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గాలను ఆర్థిక సర్వే గట్టున పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల్ని విస్మరించింది. అమెరికా, చైనా లాంటి దేశాలు కృత్రిమ మేధా (ఏఐ)లో పోటీ పడుతూ.. ఈ రంగంలో దూసుకుపోతుండగా.. టెక్నాలజీలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్న భారత్ వెనుకబాటుపై వివరణ ఇవ్వలేదు. దేశం మెరుగైన వృద్ధి రేటును సాధించకుండా నిరుద్యోగం తగ్గిందని ఎకనామిక్ సర్వేలో ప్రకటన చేయడం నిపుణులను విస్మయానికి గురి చేస్తోంది.
రోజుకు 10 గంటల పని..!
ఎకనామిక సర్వేలో కార్మిక వ్యతిరేక విధానాలు కొట్టిచ్చినట్లు కనబడ్డాయి. ఇటీవల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతోంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని తొలుత కొత్త పాట అందుకోగా.. దీనికి కొనసాగింపుగా అంతకు మించి ఎల్అండ్టీ ఛైర్మెన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఏకంగా 90 గంటల పని చేయాలని.. అంటే రోజుకు 12 గంటలు శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నయా బానిస విధానంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. వారానికి 60 గంటల వరకూ పని విధానం పర్వాలేదంటూ కొత్త పాట అందుకుంది. అంటే వారంలో ఒక్క రోజు సెలవు పోయినా.. మిగితా దినాల్లో రోజుకు సగటున 10 గంటల పని చేయాలని ప్రతిపాదించి నట్లయ్యింది. కార్మిక చట్టాల హక్కుల ప్రకారం..వారానికి 48 గంటలు పని మించ కూడదు. కాగా.. వారా నికి 60 గంటలకు మించి పని చేస్తేనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడు తుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. రోజుకు 12 గంటలు పని చేయడం ద్వారా అనారోగ్యం పాలవుతారని తెలిపింది. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం అంటూనే 60 గంటల పని విధానాన్ని ప్రతి పాదించడం వెనుక కార్పొరేట్ శక్తులున్నాయని అర్థం అవుతోంది. మరోవైపు పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతు ందని పారిశ్రమిక వర్గాల మనసులో మాటను ఎకనామిక్ సర్వేలో చెప్పింది. ప్రస్తుత పనిగంటలు కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని పరోక్షంగా పేర్కొంది. సౌకర్యవంతమైన పని గంటల విధానం భారత్ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చేర్చుతుందని.. నూతన ప్రతి పాదిత విధానంతో పరిశ్రమల వృద్ధికి దోహదం జరుగుతుందని తెలిపింది.
ఐదేండ్ల కనిష్టానికి వేతనాలు కార్పొరేట్ల లాభాలు ఫుల్
న్యూఢిల్లీ : నెలసరి వాస్తవ సగటు వేతనాలు పెరగాల్సింది పోయి.. భారీగా తగ్గాయి. మరోవైపు కార్పొరేట్ల ఆదాయాలు, లాభాలు ఫుల్గా పెరిగాయి. దేశంలో కార్మికులు 2017-18 స్థాయిల కంటే తక్కువ వేతనాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో వెల్లడయ్యింది. 2017-18లో పురుష స్వయం కార్మికుల సగటు నెల వేతనాలు రూ.9,454గా ఉండగా.. 2023-24 నాటికి 9.1 శాతం తగ్గి రూ,8,591కి పరిమితమయ్యాయి. ఇదే సమయంలో మహిళల స్వయం ఉపాధి కార్మికులకు నెలవారీ వేతనం 32 శాతం క్షీణించి రూ.2,950గా నమోదయ్యింది. మరోవైపు పురుష వేతన కార్మికులకు నెలవారీ వేతనం 2017-18లో రూ.12,665గా ఉండగా.. 2023-24 నాటికి 6.4 శాతం తక్కువతో రూ.11,858గా నమోదయ్యింది. ఇదే సమయంలో మహిళా వేతన కార్మికులకు రూ.10,116 నుండి 12.5 శాతం క్షీణించి రూ.8,855కు పరిమితమయ్యింది. పురుష క్యాజువల్ కార్మికుల వేతనాలు 2017-18 స్థాయిలతో పోలిస్తే 2023-24లో 19.2 శాతం పెరిగి రూ.242కు చేరింది. 2017-18లో ఇది రూ.203గా ఉంది. మహిళలకు రూ.128 నుంచి 24 శాతం పెరిగి రూ.159కి చేరింది. గత సంవత్సరాల్లో స్వయం ఉపాధి, జీతభత్యాల కార్మికుల వేతనాలు భారీగా తగ్గాయి. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగింది. ఫలితంగా ప్రజల ఆదాయాలు క్షీణించాయి. మరోవైపు ‘గడిచిన నాలుగేండ్లలో కార్పొరేట్ల నికర లాభాలు సగటున 22 శాతం చొప్పున పెరిగాయి. కంపెనీల ఆదాయాలు పెరిగినా ఉద్యోగుల వేతనాల్లో మాత్రం స్తబ్దత నెలకొంది.’ అని ఆర్థిక సర్వే పేర్కొంది.
































