Central Govt interest free loans To AP Farmers: ఏపీలోని రైతులు కేంద్రం శుభవార్త చెప్పింది. వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలలో వచ్చిన మిచౌంగ్ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సోమవారం ప్రకటించింది. మిచౌంగ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. పొగాకు బోర్డు విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పొగాకు బోర్డుల వేలం ప్లాట్‌ఫామ్‌లో ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు అమ్మకానికి కేంద్రం అనుమతించింది.
ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ.. పొగాకు రైతులకు పదివేల రూపాయల చొప్పున వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. పొగాకు బోర్డుకు చెందిన గ్రోయర్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని అందులో సభ్యులుగా ఉన్న రైతులకు అందించనున్నారు. ఈ విషయాన్ని వాణిజ్యశాఖ సోమవారం అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఎఫ్‌సీవీ రకం పొగాకు ఏపీ, కర్ణాటకలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. అయితే డిసెంబర్ ఐదో తేదీన వచ్చిన మిచౌంగ్ తుపాను కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలలోని పొగాకు రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు.