వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్య భరోసాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై)’ పథకంలో చేరేందుకు వయో వృద్ధులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమాను అందించే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది 30న ప్రారంభించారు. అయితే పథకంపై ప్రజల్లో సరైన అవగాహన లేక అంతగా ఆదరణకు నోచుకోలేదు.
దరఖాస్తులు ఇలా : ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై, ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https:///abdm.gov.in వెబ్‌సైట్‌లో ఆయుష్మాన్ భారత్ ఎలిజిబుల్ ట్యాబ్‌పై క్లిక్ చేసి అనంతరం ఓటీపీ ఎంటర్ చేయాలి. కేవైసీ కోసం పూర్తి వివరాలు ఎంటర్ చేసి ఆమోదం కోసం వేచి ఉండాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రయోజనాలు ఇవీ : ఈ పథకంలో చేరిన వారికి సంవత్సరానికి ఒకసారి కనీసం రూ.5 లక్షల వైద్య సహాయం అందుతుంది. అందులో మూడు రోజుల పాటు ఉచితంగా హాస్పిటల్లో చేర్చుకోవడం, వైద్య పరీక్షలు, చికిత్స, ఇంటెన్సిప్ కేర్ తదితర సేవలు పొందొచ్చు. ఉచితంగా మెడిసన్, వసతి, పోషకాహారం వంటి సేవలు సైతం లభిస్తాయి.
“ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో భాగంగా 70 సంవత్సరాలు పై బడిన వృద్ధులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా(హెల్త్ ఇన్సూరెన్స్) అందించే ప్రత్యేక కార్యక్రమం 5 నెలల క్రితమే ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌లో కానీ ఆశాలు, ఏఎన్‌ఎంలు వద్ద కానీ వయో వృద్ధుల వివరాలు నమోదు చేసుకుని పథకంలో చేరొచ్చు. మీ సేవా కేంద్రాలు, సీఎస్‌సీ కేంద్రాల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని వయో వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి”