కేంద్రం సూపర్ స్కీమ్.. ఏడాదికి 436 చెల్లిస్తే.. 2 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

www.mannamweb.com


ఆపద ఎప్పుడు ముంచుకొస్తుందో చెప్పలేము. కుటుంబ పెద్ద అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది. ఆర్థికంగా చితికిపోతారు. కాబట్టి జీవిత బీమా చేయించుకోవడం చాలా అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముందుగానే బీమా చేయించుకున్నట్లైతే ఆపద సమయంలో ఆదుకుంటుంది. బీమాదారుడు మరణిస్తే వచ్చే సొమ్ముతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తుంది. అయితే బీమా చేయించుకునేందుకు ప్రీమియం ఎక్కువగా ఉండడంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికోసం కేంద్రం సూపర్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఏడాదికి 436 చెల్లిస్తే చాలు.. 2 లక్షలు పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని (పీఎం జేజేబీవై) తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా లభిస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవచ్చు. పీఎంజేజేబీవై ప్రస్తుత ప్రీమియం ఏడాదికి రూ.436గా ఉంది. అంటే.. నెలకు రూ.36 చొప్పున పడుతుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి, బ్యాంకులు, పోస్టాఫీసులో ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. లైఫ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐసీ), ఇతర భాగస్వామ్య జీవిత బీమా కంపెనీల ద్వారా ఈ పథకం అందుబాటులో ఉంది.

పీఎంజేజేబీవై పథకం ద్వారా ఏ కారణంతోనైనా బీమా దారుడు మరణిస్తే రూ.2 లక్షల బీమా కుటుంబ సభ్యులకు అందుతుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్ ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితితో వ‌స్తుంది. ప్రతి సంవ‌త్స‌రం ప్రీమియం చెల్లించి ప‌థ‌కాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం వద్దనుకుంటే బ్యాంకులో సంప్రదించి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్​లో చేరేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా అకౌంట్​ నుంచి ఆటోమేటిక్‌గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి. డెబిట్‌ అయ్యే సమయంలో ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది.