మనం జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళతామా? లేక ఎటూ కాకుండా పోతామా? అన్నది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. మనకు ఎంతో సాధారణంగా అనిపించే అలవాట్లు కూడా..
భవిష్యత్తులో ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి. కొంతమందికి వాటి వల్ల జీవితం పాడవుతుందని తెలియకపోవచ్చు.. మరికొంత మంది తెలిసినా కూడా కావాలనే పదే పదే అలవాట్లను కొనసాగిస్తూ ఉంటారు. ఆచార్య చాణక్యుడు చెబుతున్న దాని ప్రకారం ఈ 6 అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరంట.. దరిద్రులుగానే మిగిలిపోతారంట. మన జీవితాన్ని పాడు చేసే.. పేదరికంలో కుంగిపోయేలా చేసే ఆ 6 అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని మానుకుని మంచి భవిష్యత్తుకు బాట వేసుకుందాం.
మధ్యాహ్నం నిద్రపోవటం
చాలా మందికి మధ్యాహ్నం నిద్రపోవటం అన్నది అలవాటు కాదు.. వ్యసనం. రాత్రి 7,8 గంటలు నిద్రపోయి కూడా.. నిద్ర చాలట్లేదన్నట్లు మధ్యాహ్నం కూడా నిద్రపోతూ ఉంటారు. మధ్యాహ్నం పవర్ నాప్ లాగా ఓ అరగంట పడుకుంటే పర్లేదు కానీ, గంటలు గంటలు బెడ్‌కు పరిమితం అయితే.. అనారోగ్యం తప్పదు. లేనిపోని రోగాలు వస్తాయి. చాణక్యుడు చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో వారి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాదట. ఆ ఇళ్లలో దరిద్రం తాండవిస్తుందట.
పరిశుభ్రమైన దుస్తులు
వ్యక్తి గత పరిశుభ్రత మనిషికి చాలా ముఖ్యం. అది పాటించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సివస్తుంది. కొంతమంది రెండు,మూడు రోజులకోసారి స్నానం చేస్తారు. ఉతికిన బట్టలు వేసుకోరు. శుభ్రతకు ఆమడ దూరంలో ఉంటారు. అలాంటి వారు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. తద్వారా లక్ష్మీ దేవి మననుంచి వెళ్లిపోతుంది.
మాటలు కత్తుల్లా వాడేవారు
కొంతమంది ఉంటారు. ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలీదు. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతీ చిన్న దానికి అవతలి వ్యక్తిని నిందించి తిడుతూ ఉంటారు. ఇలాంటి వారి జీవితంలో బంధాలు త్వరగా విఫలం అవుతాయి. తోటి వారితో మంచి రిలేషన్ లేకపోతే ఎప్పటికైనా దరిద్రం తప్పదు.
బిచ్చగాళ్ల ఆలోచన
కొంతమందికి సంపాదించటం అన్నా.. సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం అన్నా ఇష్టం ఉండదు. ప్రతీ దానికి ఇతరులపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ముఖం మీద అసహ్యించుకున్నా పట్టించుకోరు. సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని అవసరాల కోసం బతుకుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎప్పటికీ దరిద్రంలోనే ఉంటారు.
పళ్లు తోముకోని వాళ్లు
వాస్తవానికి మన శరీర ఆరోగ్యం మొత్తం పళ్లమీదే ఆధారపడి ఉంటుంది. పదార్థాలను బాగా నమిలి తినటం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యంగా ఉంటాము. ఏ పదార్థాలనైనా చకచకా నమిలేయాలంటే ఆరోగ్యరమైన పళ్లు ఉండాలి. కొంతమంది పళ్ల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సరిగా పళ్లు కడుక్కోరు. ఇలా చేయటం వల్ల లక్ష్మీ దేవి వారి దగ్గర ఉండదని చాణక్యుడు అన్నాడు.
అతిగా తినటం
ఆచార్య చాణక్యుడు చెబుతున్న దాని ప్రకారం అతిగా తినేవారి దగ్గర కూడా లక్ష్మీ దేవి ఉండదట. ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అని తెలిసిన వారి జీవితంలోనే లక్ష్మీ దేవి ఉంటుందట.