బీ అలెర్ట్.! ఏపీలో ఈ ప్రాంతాలకు పిడుగులు పడే ఛాన్స్.. తాజా వెదర్ రిపోర్ట్

www.mannamweb.com


ఎండీ సూచనల ప్రకారం మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. జూలై 17న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 44.2మిమీ, ఇచ్చాపురంలో 23మిమీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 20.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు..వాతావరణ శాఖ అధికారులు.