ఏపీలో డ్రాగన్ పంటకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లోని రైతులు వీటిని సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ లో డ్రాగన్ పండు ధర రూ.100 నుంచి రూ.150 మధ్య పలుకుతోంది.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం డ్రాగన్ పంట సాగుచేసే రైతులకు రాయితీ ఇస్తోంది. దీన్ని సాగు చేయడానికి అవసరమయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోంది. జన్యుపరంగా ఇది మంచి పోషకాల మొక్క. రాయితీపై పంట సాగుచేసేందుకు అర ఎకరాపైన.. ఐదెకరాల లోపు ఉన్న రైతులు అర్హులు.
నీటి అవసరం ఉండదు
ప్రస్తుతం అర ఎకరా సాగుకు రాయితీ అందిస్తున్నారు. డ్రాగన్ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులు జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో సమీపంలోని ఉపాధి కార్యాలయాల అధికారులను సంప్రదించాలి. దీన్ని మెట్ట భూముల్లో సాగు చేస్తారు. నీరు పెద్దగా అవసరపడదు. వారానికి ఒకరోజు మొక్కలకు నీరుపెట్టినా చాలు.
నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉండి, పొలం ఎక్కువగా ఉన్న రైతులు ఈ మొక్కలను తీసుకొచ్చి ఏడు లేదంటే పది అడుగులకు ఒక మొక్క చొప్పున నాటాలి. ఎంత దూరంగా నాటితే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది. రింగ్ పద్ధతిద్వారా సాగు చేయడం రైతన్నలకు లాభసాటిగా ఉంటుంది. ఎంత పెద్ద వర్షం పడినా ఈ రింగ్ పద్ధతిలో ఎటువంటి నష్టం వాటిల్లదు. అన్నదాతలు కూడా ఈ పద్ధతిలో సాగుచేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులు
ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులు. పంచాయితీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పత్రాలు కార్యాలయంలో అందజేస్తే అర్హులను ఎంపిక చేస్తారు. సాగుకు అవసరమైన పోషకాలను అందిస్తుంటే ఏడాదిలోగా పంట కోతకు వస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతోపాటు స్థానికంగా ఉండే మార్టుల్లో అమ్మకాలు సాగించవచ్చు. డ్రాగన్ పంటను సాగుచేసిన రైతులు కొందరు సొంతంగా నాలుగు చక్రాల వాహనాల్లో వాటిని నగరాలకు తీసుకువచ్చి సొంతంగా అమ్మకాలు చేపడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులతోపాటు ఉద్యాన శాఖ అధికారులు, ఉపాధి కార్యాలయ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలను పొందొచ్చు.