CBN Cabinet: బాబు క్యాబినెట్‌లో లోపించిన ‘పెద్దరికం’.. పాతవాసనలు ఎందుకు వద్దనుకున్నట్టు?

తెలుగు దేశం పార్టీలో పెద్దరికం సినిమాకు సీక్వెల్ నడుస్తోంది. అధినేత ఓకే చేసిన 24 క్యాబినెట్ కుర్చీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పెద్దోళ్లకు దక్కలేదెందుకు? సీనియర్లందరికీ మొండిచెయ్యి చూపడమేంటి? నిన్నమొన్న వచ్చిన జూనియర్లు జాక్‌పాట్ కొట్టడమేల? అధిష్టానం ఆలోచనా తీరు సడన్‌గా ఎందుకిలా మారింది..?


తెలుగు దేశం పార్టీలో పెద్దరికం సినిమాకు సీక్వెల్ నడుస్తోంది. అధినేత ఓకే చేసిన 24 క్యాబినెట్ కుర్చీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పెద్దోళ్లకు దక్కలేదెందుకు? సీనియర్లందరికీ మొండిచెయ్యి చూపడమేంటి? నిన్నమొన్న వచ్చిన జూనియర్లు జాక్‌పాట్ కొట్టడమేల? అధిష్టానం ఆలోచనా తీరు సడన్‌గా ఎందుకిలా మారింది..? అంటూ టీడీపీ లోపలా వెలుపలా ఆసక్తికరమైన చర్చ. అటు.. సీనియర్ల విషయంలో చంద్రబాబు అమలు చేసిన సింగిల్ పాయింట్ ఫార్ములాపై కూడా హాట్‌హాట్‌గా మాటలు నడుస్తున్నాయి. ఏమిటా ఫార్ములా? కొత్త తరం కోసం కొత్త నాయకత్వం ఇదేనా బాబు అమలు చేసిన వ్యూహం?

గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణ మూర్తి.. ఇదంతా టీడీపీలో పెద్ద తలకాయల జాబితా. వీళ్లంతా తెలుగుదేశం పార్టీకి లోకల్‌ బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్లవాళ్ల ప్రాంతాల్లో టీడీపీని భుజం మీద మోసి, జనంలోకి తీసుకెళ్లినవాళ్లు. పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు ముప్పై-నలభై ఏళ్లుగా మనం చూస్తూ వస్తున్న సూపర్‌సీనియర్లు. తెలుగుదేశం రంగు-రుచి- వాసన బాగా వంటబట్టించుకుని పార్టీ పనుల్లోనే మునిగిపోయి, నానిపోయి.. పార్టీయే ప్రాణంగా బతికిన ఆ డజనుమంది పెద్దోళ్ల ఆచూకీ.. చంద్రబాబు తాజా క్యాబినెట్‌లో గల్లంతైంది. కారణం ఏమిటి చెప్మా?

ఏపీలో కొత్తగా కొలువుదీరిన 24 మంది మంత్రుల్లో 20 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు. వీళ్లలో 17 మంది కొత్తవాళ్లు.. 8 మందయితే పూర్తిగా ఫ్రెష్షర్స్. గతంలో అసెంబ్లీ మొహమే చూడని ఫస్ట్‌ టైమ్ ఎమ్మెల్యేలు. కానీ.. చంద్రబాబు బెటాలియన్‌లో చోటు దక్కించుకున్నారు. గెలిచొచ్చిన సీనియర్ మోస్ట్‌ లీడర్ల పేర్లయితే క్యాబినెట్ లిస్టులో గల్లంతయ్యాయి. ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పరిటాల సునీత లాంటి వాళ్లను మినహాయిస్తే.. వీళ్లకంటే గొప్పగొప్ప సీనియారిటీలున్న లీడర్లందరూ ఇప్పుడు మంత్రివర్గానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అధినేత నిర్ణయమే శిరోధార్యం అనుకుని గప్‌చుప్‌గా ఉండిపోయారు సీనియర్లు. కానీ.. క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం.. సాహసోపేతమైనదన్న మాటైతే వినిపిస్తోంది.

ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప.. ఈ నాలుగు జిల్లాల్లో జూనియర్లకే మంత్రి పదవులివ్వడాన్ని పార్టీ అధిష్టానం గట్టిగా సమర్థించుకుంటోంది. ఇక్కడ సీనియర్-జూనియర్ ఇష్యూను టాకిల్ చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించింది తెలుగుదేశం అధిష్టానం. ఆయా జిల్లాల్లో సీనియర్ ఫ్యామిలీల మధ్య ఉండే విభేదాల్ని సర్దుబాటు చెయ్యాలంటే.. అందరినీ క్యాబినెట్‌కి దూరంగా పెట్టడమొక్కటే మార్గం. ఒకరికిస్తే మరొకరు నొచ్చుకుంటారు కనుక… కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా పాతవాళ్లందరి నోళ్లూ మూయించవచ్చని హైకమాండ్ భావించిందా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు ఓటమెరుగని ధీరుడిగా పేరుంది. అటు.. పార్టీకి వీరవిధేయుడు అయ్యన్నపాత్రుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి జైలుక్కూడా వెళ్లారు. గంటా శ్రీనివాసరావు కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. పైగా.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పార్టీ ఆమోదం లేకుండానే రాజీనామా చేశారు. మొదట్లో విశాఖ జిల్లా నుంచి అయ్యన్నకు క్యాబినెట్‌లో చోటిద్దామని పార్టీ భావించినప్పటికీ.. ఆఖర్లో వెనక్కు తగ్గింది. ఆయనకిస్తే గంటా కినుక వహిస్తారనేది ఒక కారణం. ఎందుకంటే.. జిల్లాల్లో గంటా-అయ్యన్న మధ్య నడిచే ఆధిపత్యపోరు లోకల్‌గా అందరికీ తెలుసు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా విశాఖ టీడీపీలో మరో సీనియర్ నేత. ఆయన అల్లుడు రామ్మోహన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం రావడంతో.. రాష్ట్ర క్యాబినెట్‌లో తనకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం లేదు. ఇలా సీనియర్లందరికీ తలోరకంగా చెక్ పెడుతూ.. చివరాఖరికి.. పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అవకాశమిచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా, పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా సీనియర్ల కంటే యాక్టివ్‌గా ఉన్న అనితను క్యాబినెట్‌లోకి తీసుకుని.. ఫ్యూచరిస్టిక్ పాలిటిక్స్‌కి తెరతీశారు చంద్రబాబు. ఎస్సీగా, మహిళగా అనితకు ఛాన్స్ ఇచ్చి.. విశాఖ జిల్లా రాజకీయాల్ని కీలక మలుపు తిప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు.

మరో ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలో సైతం దాదాపుగా ఇదే ఫార్ములానా వర్కవుట్ చేసింది టీడీపీ హైకమాండ్. పార్టీ ఆవిర్భావం నుంచి లెగసీని కొనసాగిస్తూ వస్తున్న అశోక్‌గజపతిరాజు, కళావెంకట్రావు కుటుంబాలకు ఈసారి క్యాబినెట్‌లో ప్లేస్ లేకుండా పోయింది. అశోక్‌గజపతి రాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించి చీపురుపల్లిలో ఘన విజయం సాధించారు కళావెంకట్రావు. నాలుగుసార్లు మంత్రిగా, రాజ్యసభ మెంబర్‌గా, గతంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళావెంకట్రావు సీనియారిటీ ఈసారి క్యాబినెట్ కూర్పుపై ప్రభావం చూపలేకపోయింది. గజపతి, కళా వెంకట్రావు ఫ్యామిలీల్లో ఏ ఒక్కరికిచ్చినా మిగతా వారు నొచ్చుకుంటారు. అందుకే.. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని జిల్లాలో నవయువ కెరటంగా పరిచయం చేసుకుంటోంది టీడీపీ. యూఎస్‌లో చదివి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న కొండపల్లి.. బొబ్బిలి ఎంపీగా మూడుసార్లు గెలిచిన పైడితల్లినాయుడుకి మనవడు. మంత్రి బొత్స సోదరుడు అప్పల నర్సయ్యను ఓడించిన కొండపల్లి శ్రీనివాస్‌కి బెర్త్ కట్టబెట్టి.. విజయనగరం జిల్లా టీడీపీ బ్రాండ్‌కి కొత్త కలర్ ఇచ్చేశారు చంద్రబాబు.

ఇక.. తూర్పుగోదావరి జిల్లా.. దశాబ్దాల తరబడి ఈ జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలబెట్టిన సీనియర్లు అరడజను మంది దాకా ఉన్నారు. యనమల, చినరాజప్ప, బుచ్చయ్య, జ్యోతుల నెహ్రూ.. వీళ్లందరూ జిల్లాలో పార్టీకి వెన్నెముకలు. సీనియారిటీ విషయంలో ఎవ్వరికి ఎవ్వరూ తగ్గరు. ఒకరిని డామినేట్ చేయాలని మరొకరు చూస్తారు. ముఖ్యంగా యనమల వారసురాలిగా తుని ఎమ్మెల్యే దివ్యకు మహిళా కోటాలో ఛాన్స్ రావచ్చని అందరూ భావించారు. అది కార్యరూపం దాల్చలేదు. వియ్యంకుడికి, అల్లుడికి టిక్కెట్లిప్పించుకున్న యనమల.. క్యాబినెట్లో మాత్రం తన మార్క్ చూపించుకోలేకపోయారు. సీనియర్లలో ఏ ఒక్కరికి అవకాశమిచ్చినా మిగతా వాళ్లు అలకపాన్పు నెక్కుతారు కనుక.. చంద్రబాబు మరోవైపు చూశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన వాసంశెట్టి సుభాష్‌ని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. వైసీపీ యువజన విభాగంలో పనిచేసిన సుభాష్.. మూడు నెలల కిందటే టీడీపీలో చేరారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న శెట్టిబలిజ వర్గాన్ని తమ వైపు మళ్లించుకోవడానికే సుభాష్‌ని ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈవిధంగా ఒక్క షాట్‌తో ఐదారు బిగ్ ఫ్యామిలీల్ని దారికి తెచ్చుకుంది టీడీపీ అధిష్టానం.

రాయలసీమలోని జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ ఇదే పంథాను ఫాలో అయ్యింది. వరదరాజులురెడ్డి, బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి, కడప గడ్డపై భార్య మాధవిరెడ్డిని గెలిపించుకున్న రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి.. వీళ్లంతా కడప జిల్లా నుంచి క్యాబినెట్‌ బెర్త్ కోసం ఆశించారు. సీనియర్ల మధ్య ఇంత పోటీ ఉంది గనుకే.. జూనియర్ వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. రాయచోటి నుంచి గెలిచిన 43 ఏళ్ల యువకుడు.. డెంటల్ డాక్టర్ మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని పిక్ చేసుకుంది టీడీపీ హైకమాండ్. పేరుకు జూనియరే ఐనా గడికోట శ్రీకాంత్‌రెడ్డి లాంటి సీనియర్ వైసీపీ లీడర్‌ని ఓడించిన జెయింట్ కిల్లర్‌గా.. క్యాబినెట్ కుర్చీని దక్కించుకున్నారు రాంప్రసాద్‌రెడ్డి. ఆవిధంగా కడప జిల్లాలో మిగతా సీనియర్లను కూల్‌డౌన్ చేసింది టీడీపీ.

ఇదీ… సీనియర్‌-జూనియర్ ఇష్యూను చంద్రబాబు ట్యాకిల్ చేసిన తీరు.. 4 జిల్లాల్లో ఆయన పాటించిన సింగిల్ పాయింట్ ఫార్ములా. చిన్నవాళ్లకు పెద్దపీటలు వేశాం.. అలాగని పెద్దవాళ్లను చిన్నచూపు చూడలేదు.. అని ఆయా నేతలకు పరోక్షంగా సంకేతాలిచ్చింది హైకమాండ్. పెద్దోళ్ల సేవల్ని పార్టీలో ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో చంద్రబాబుకు క్లారిటీ ఉందట. రేపటిరోజున నామినేటెడ్ పదవులు గానీ, ఎమ్మెల్సీ పోస్టులు గానీ, రాజ్యసభకు అవకాశాలు గానీ.. సీనియర్ల కోసం వెయిటింగ్‌లో ఉన్నాయట. వీటన్నింటికీ మించి గవర్నర్‌ పదవులు కూడా సిద్ధమౌతున్నాయి. ఎందుకంటే.. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి.. బీజేపీ మరో బంపరాఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ కోసం ఒకటో రెండో గవర్నర్ పదవుల్ని రిజర్వు చేసిందట. సీనియర్ నేతలు అశోక్‌గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడుతో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అందుకే. సీనియర్లూ.. ప్లీజ్ కీప్ క్వయిట్.. వేచి ఉండండి… మీకోసం కూడా ఉందిలే మంచికాలం ముందుముందునా.. అంటూ సానుకూల సంకేతాలిచ్చారు చంద్రబాబు.