జగన్ కు మళ్లీ అధికారం పై తేల్చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్‌వైభవం వస్తుందని, ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని అన్నారు.
తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్నారు. టీడీపీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటూ టీడీపీ ఎదిగిందన్నారు.
భూస్థాపితం చేస్తాం
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చంద్రబాబు ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం గురించి వివరించారు. 2019 తర్వాత ఏపీలో విధ్వంస ప్రభుత్వం వచ్చిందన్న ఆయన విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఏపీలో వైసీపీ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువ జరిగిందని ధ్వజమెత్తారు. కొంత మంది తనను తిరిగి పాత ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారని.. ఈ ఎన్నికలతో అడ్రస్ లేకుండా పోయిన ఆ పార్టీ..ఆ భూతంను రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
నాటి చంద్రబాబును చూస్తారు
దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని చెప్పారు. తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజులు లేరని, విర్రవీగితే ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవకులని పెత్తందారులు కాదని వ్యాఖ్యానించారు. 2024లో 1995 సీబీఎన్‌ను చూస్తారన్న చంద్రబాబు, అప్పుడు ఎలా పనిచేశానో ఇప్పుడు అలానే చేస్తానని పేర్కొన్నారు.
కలిసి పని చేస్తాం
తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని పార్టీల సిద్దాంతాలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికామని..తన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవటంతో..తన చొరవను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. తెలుగురాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఇక్కడి పాలకులకు ఉందని చంద్రబాబు వివరించారు.