గతంలో ప్రతిపక్షనేతగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి ఈ టాక్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ఫ్యామిలీ, జైలు జీవితం, పవన్ కళ్యాణ్‌తో మీటింగ్, పొత్తు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇలా ఎన్నో అంశాల గురించి అన్ స్టాపబుల్ లో పంచుకున్నారు చంద్రబాబు.
కాగా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు సుమారు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిశార. ఆ తర్వాత బయటకు వచ్చి టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తర్వాత అంతా తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఈ మీటింగ్ లో పవన్ తో ఏం మాట్లాడారు? అని అన్ స్టాపబుల్ షో వేదికగా చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు.
‘జైలులో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ వచ్చి నన్ను కలిశారు. పవన్ కల్యాణ్ తో నేను 2 నిమిషాలు మాట్లాడాను. ‘ధైర్యంగా ఉన్నారా సార్’ అని పవన్ అడిగారు. ‘ నా జీవితంలో నేనెప్పుడూ అధైర్య పడలేదు. భయపడను. మీరు కూడా ధైర్యంగా ఉండండి’ అని పవన్ తో చెప్పాను. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్ని చూసిన తరువాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానని పవన్ చెప్పారు’
‘అప్పుడు నేనే ముందు పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చాను. ఓ సారి ఆలోచించండి. అందరం కలిసి పోటీ చేద్దామని పవన్‌తో చెప్పాను. దానికి ఆయన కూడా ఆలోచించి ఓకే చెప్పారు. బీజేపీకి కూడా నచ్చజెప్పి ఈ కూటమిలోకి తీసుకువస్తానని చెప్పాడు. ఆ తరువాత బయటకు వెళ్లి పవన్ కూటమి ప్రకటన చేశారు. అదే తమ విజయానికి నాంది ‘ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.