ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఇవాళ విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.
ఇందులో పవన్ కళ్యాణ్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు వైసీపీ పాలనలో పడిన కష్ఠాల్ని గుర్తుచేసుకున్నారు. ఓ దశలో చంద్రబాబును పక్కనే నిలబెట్టుకుని ఆయన చేతిలో చేయేసి ఎమోషనల్ అయ్యారు.
అంతకు ముందు ఎన్డీయే ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గతంలో తాను చెప్పినట్లుగా చంద్రబాబు దార్శనికుడని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న చంద్రబాబుకు కూడా అభినందనలు తెలిపారు. ఐదేళ్లుగా ఏపీ ప్రజలు నలిగిపోయారని, రాష్ట్రంలో విపత్కుల పరిస్ధితులపై సమష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీలతో ఎన్నికయ్యామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్డీయే విజయం దేశానికే స్ఫూర్తినిచ్చిందన్నారు.
ఒక్క ఓటు కూడా చీలకుండా, కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు, మూడు పార్టీలు కలిసి చూపించాయని పవన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తాను ఇచ్చిన మాటపై నిలబడి ప్రజల నమ్మకాన్ని పెంచామన్నారు. చాలా హామీలిచ్చామని, ఇది కక్షసాధింపులకు సమయం కాదని, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని పవన్ తెలిపారు. ఉమ్మడిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, శాంతిభద్రతల అంశంలో బలంగా నిలబడాలన్నారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు. ఇలాంటి కీలక సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఉందన్నారు. విదేశీ నాయకులను తెలుగు రాష్ట్రాలకు తీసుకురాగల చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరం ఉందన్నారు. అనుభవంతో పాటు ధైర్యశాలి అయిన చంద్రబాబును అందుకే ఎన్డీయే నేతగా ఎన్నుకుంటున్నామన్నారు.