కొలికపూడి పై చంద్రబాబు సంచలన నిర్ణయం.

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు వ్యవహారం పార్టీలో రచ్చగా మారుతోంది. వరుస వివాదాలతో కొలికపూడి పార్టీ నాయకత్వానికి సమస్యగా మారుతోంది.


కొలికపూడి తీరు పైన పార్టీ కమిటీ నివేదిక చంద్రబాబు కు అంద చేసింది. పార్టీ అధినాయకత్వానికే కొలికపూడి అల్టిమేటం ఇవ్వటాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో, చంద్రబాబు నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

రాజీనామా చేస్తారా

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి డెడ్ లైన్ ముగిసింది. రమేశ్ రెడ్డి పైన 48 గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానని కొలికపూడి అల్టిమేటం జారి చేసారు. దీంతో, ఎమ్మెల్యే పార్టీ నాయకత్వానికే డెడ్ లైన్ విధించటాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వరుస వివాదాలతో సమస్య గా మారుతున్నకొలికపూడి వ్యవహారం పైన పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది. పార్టీకి సమస్యలు తీసకొస్తున్నారనే అభిప్రాయం కొలికపూడి పైన పార్టీలో కనిపిస్తోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉంది. తాజాగా స్థానిక టీడీపీ నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా అధిష్ఠానానికే అల్టిమేటం జారీ చేయడం సంచలనంగా మారింది.

కమిటీ నివేదిక

రమేశ్ రెడ్డి పైన చర్యలు తీసుకోకుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బెదిరించడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీంతో, ఈ వ్యవహారం పైన ఎన్టీఆర్‌ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సత్యనారాయణరాజుతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో గత 10 నెలలుగా చోటుచేసుకున్న సంఘటనలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. దానిని పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. కొలికిపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబు నిర్ణయానికి వదిలేసారు. దీంతో, చంద్రబాబు ఇప్పుడు తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.

అమరావతి వేదికగా చంద్రబాబు తాజా నిర్ణయం – బిగ్ టర్న్.

చంద్రబాబు సీరియస్

అదే సమయంలో డెడ్ లైన్ పూర్తి కావటంతో కొలికపూడి రాజీనామా చేస్తారా లేదా అనేది చర్చగా మారింది. కొలికపూడి రాజీనామా చేస్తే మరో నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. రాజీనామా చేయకపోతే పార్టీ నిర్ణయం ఏంటనేది ఉగాది తరువాత ప్రకటించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే, కొలికపూడి బహిరంగంగా పార్టీ నాయకత్వానికే అల్టిమేటం ఇవ్వటం పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, కొలికపూడి ఇచ్చిన గడువు ముగిసిన తరువాత ఒకటి, రెండు రోజులు వేచి చూసి నిర్ణయం ప్రకటించేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.