ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లు చేస్తామని స్పష్టం చేసారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు.
బడ్జెట్ లో ఇప్పటికే పథకాలు నిధులు చేసిన ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పైన గతంలో ఏ హామీ ఇచ్చామో.. అదే విధంగా అమలు చేస్తామని.. మే నెలలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు.
తల్లికి వందనం అమలు
ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. తణుకు పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికులతో ముఖా ముఖి నిర్వహించారు. ఆ సమయంలో తల్లికి వందనం అమలు పైన ప్రకటన చేసారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందన పథకం కింద బడి కి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేసారు. మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాల పై కసరత్తు జరుగుతోంది.
మే లో నిధుల జమ
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతా ల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం అమలు పైన మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లి ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతీ ఇంటా చదువుకునే ప్రతీ ఒక్కరికి ఈ పథకం అమలు అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి లోకేష్ ఈ పథకాల అమలు పైన స్పష్టత ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించారని.. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చెప్పుకొచ్చారు.
మార్గదర్శకాలు
మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంత మంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పస్టం చేస్తోంది. వైసీపీ మాత్రం రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని.. ఇందు కోసం రూ 13 వేల కోట్లకు పైగా అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75 శాతం హాజరు తప్పని సరి చేసారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాల పైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు.