ఇంటర్ పాస్ మార్కుల్లో మార్పులు, ఏ సబ్జెక్టు కు ఎంతంటే – గణితంలో ఒకే పేపర్

పీ ఇంటర్ బోర్డు కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పరీక్షా విధానం… పాసు మార్కుల్లోనూ మార్పులు చేస్తోంది. తాజా ప్రతిపాదనలను విద్యామండలి అన్ని కాలేజీలకు వివరించింది.


రాబోయే పబ్లిక్ పరీక్షల నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. పరీక్ష ల నిర్వహణతో పాటుగా పాస్ మార్కులను మార్పు చేసింది. దీంతో.. విద్యార్ధులకు ప్రధాన సబ్జెక్టుల పాస్ మార్కులు ఇక నుంచి తాజా నిర్ణయం మేరకు అమలు కానున్నాయి.

ఇంటర్ విద్యలో కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజా ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్టు ఉంది. ఇప్పటివరకూ 1ఏ, 1బీ ఉండగా వాటిని ఒక్కటిగా మార్చింది. గతంలో ఒక్కో పేపర్‌ 75 మార్కుల చొప్పున (పాస్‌ మార్కులు 26) పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఇంటర్‌ రెండేళ్లు గణితం ఒక్కటే పేపర్‌గా 100 మార్కుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అందులో 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. ఇక బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చారు. ఈ పేపరు 85 మార్కులకు ఉంటుంది. ఫస్టియర్‌లో 29 మార్కులు రావాలి. అదే సెకండియర్‌లో 30 మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్‌ అయినట్లు లెక్క! ఫిజిక్స్‌, కెమిస్ర్టీ సబ్జెక్టుల్లోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది.

కాగా, ఆయా సబ్జెక్టులకు గతంలో 60 మార్కుల చొప్పున పరీక్ష జరుపుతుండగా.. పాస్‌ మార్కులు 21గా ఉండేవి. కాగా, ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న వారికి, గతంలో ఫెయిల్‌ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు. మరోవైపు ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఏ గ్రూపు విద్యార్థులైనా మొత్తం 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. అందువల్ల విద్యార్థులు తీసుకునే సబ్జెక్టు ఆధారంగా ఫస్టియర్‌ మార్కులు మారతాయి. సైన్స్‌ సబ్జెక్టులైతే 85 మార్కులు, ఆర్ట్స్‌ సబ్జెక్టులైతే 100 మార్కులు ఉంటాయి. మొత్తంగా రెండేళ్లలో వెయ్యి మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ విద్యార్థులకు రెండేళ్లకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అలాగే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా ఉంది.

ఇదే సమయంలో అదనంగా మరో సబ్జెక్టును కూడా తీసుకుని చదవొచ్చు. అయితే అవి మొత్తం మార్కుల్లో కలపరు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంను మాత్రమే అదనపు సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం అమల్లోకి రావడంతో పరీక్షల షెడ్యూలు పెరిగింది. దీనికి సంబంధించి విద్యా మండలి అధికారులు అన్ని కాలేజీలకు కొత్త విధానం పైన సమాచారం ఇచ్చారు. ఈ మేరకు విద్యార్ధులను సిద్దం చేయాలని సూచించారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసారు. దీంతో.. తాజా మార్పులకు అనుగుణంగా విద్యార్ధులకు పరీక్షాలకు సిద్దం కావాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.