శంభాజీ మహారాజ్ వీరగాథగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava). ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఏప్రిల్ 11 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈవిషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ విడుదల చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక (Rashmika) జీవించేశారు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుందీ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
కథేంటంటే: ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం.. పాలించడం సులభమవుతుందని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) భావిస్తాడు. అయితే, వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). ప్రజల నుంచి దిల్లీ చక్రవర్తులు దోచుకొని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్‌లో బలం పుంజుకుంటున్న శంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు (Chhaava On Ott). శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? శత్రుసైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.