మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వేరేవరు వింటున్నారా?

ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎంత పెరిగిందో, సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ‘అన్‌కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్’ అనే ఫీచర్‌ను హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.


మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్‌కు వచ్చే వ్యక్తిగత కాల్స్, ముఖ్యమైన ఎస్ఎంఎస్‌లు, చివరకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను కూడా వారి నంబర్లకు మళ్లించే ప్రమాదం ఉంది. దీనివల్ల మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడమే కాకుండా, ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా మెండుగా ఉంది.
మీ ఫోన్ హ్యాకర్ల పర్యవేక్షణలో ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#21# అనే కోడ్‌ను డయల్ చేయండి. వెంటనే మీ స్క్రీన్‌పై ఒక విండో కనిపిస్తుంది. అందులో వాయిస్, డేటా, ఎస్ఎంఎస్, ప్యాకెట్ వంటి వివిధ విభాగాల పక్కన ‘Not Forwarded’ అని ఉంటే మీ ఫోన్ సురక్షితంగా ఉన్నట్టే అర్థం. ఒకవేళ ఏ విభాగం పక్కనైనా మీకు తెలియని మొబైల్ నంబర్ కనిపిస్తే, మీ సమాచారం ఇతరులకు లీక్ అవుతోందని మీరు గ్రహించాలి.

ఒకవేళ మీ కాల్స్ లేదా మెసేజ్‌లు వేరే నంబర్‌కు ఫార్వర్డ్ అవుతున్నాయని మీరు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. దీనిని అడ్డుకోవడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెతకాల్సిన అవసరం లేకుండా, సింపుల్‌గా ##002# అనే కోడ్‌ను డయల్ చేయండి. ఈ కోడ్ మీ ఫోన్‌లో ఉన్న అన్ని రకాల కాల్ ఫార్వర్డింగ్ మరియు డైవర్షన్ సెట్టింగ్లను తక్షణమే రద్దు చేస్తుంది. దీనివల్ల హ్యాకర్లు ఏర్పాటు చేసుకున్న లింక్ కట్ అయిపోయి, మీ ఫోన్ మళ్లీ మీ నియంత్రణలోకి వస్తుంది.

సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్ చేయడం, అనవసరమైన యాప్‌లకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు మీ ఫోన్ సెక్యూరిటీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయడం ద్వారా వారిని సైబర్ దాడుల నుండి కాపాడవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.