WhatsApp New Feature: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అంటే తెలియని వారుండరు. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులతో చాట్ చేయడానికి, ఆడియో-వీడియో కాల్‌లు చేయడానికి, ఫొటోలు, వీడియోలు, ఫైల్‌లను షేర్ చేయడానికి ఈ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల తమ యాప్ ద్వారా వినియోదారులకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లున తీసుకొస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఆ ఫీచర్ ద్వారా మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరూ స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. తాజా సమాచారం ప్రకారం.. ప్రొఫైల్ ఫొటో స్క్రీన్‌షాట్‌లను తీయకుండా వినియోగదారులను నిరోధించే ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాట్సాప్ డీపీలతో చాలా మోసాలు జరిగాయి. వాట్సాప్ డీపీ ఫొటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అంతేకాకుండా వేధించడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకువస్తుంది.
WabetaInfo నివేదిక ప్రకారం.. ఇది వినియోగదారులను ఒకరి ప్రొఫైల్ ఫొటోని స్క్రీన్‌షాట్‌లను తీయకుండా పరిమితం చేస్తుంది. మీ అనుమతి లేకుండా మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరూ షేర్ చేయలేరు. అయితే ఇప్పటి వరకు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే వచ్చింది. ఇంకా iOS వినియోగదారులకు అందుబాటులో లేదు. త్వరలో ఇది iOS వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది.
ఈ అప్‌డేట్ వచ్చినప్పుడు ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీసే సదుపాయం నిలిపివేయబడిందని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే అప్పుడు ఎవరూ WhatsApp లోపల నేరుగా మీ ప్రొఫైల్ ఫోటో స్క్రీన్‌షాట్ తీసుకోలేరు. అయితే ఈ ఫీచర్ అనుమతి లేకుండా ఫోటోలను షేర్ చేయడం వల్ల వచ్చే సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. కాగా వాట్సాప్ వినియోగదారులకు వారి వ్యక్తిగత సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్‌తో ప్రొఫైల్ ఫొటోల దుర్వినియోగం తగ్గుతుందని సంస్థ భావిస్తున్నారు.