Chengeri Mokka : ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను ప్రసాదించిది. ఈ మొక్కలలో మనకు ఉపయోగపడే మొక్కలు చాలానే ఉన్నాయి. ప్రతి మొక్కలోనూ ఒక ప్రత్యేకత, ఒక వైద్య గుణం ఉండనే ఉంటుంది.
దానిని మనం గుర్తించి ఆ మొక్కలను ఉపయోగించుకుంటే మనకు వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అలా ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో చెంగేరి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎన్నో ఔషద గుణాలను కలిగి ఉంటుంది.
దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. ఈ చెంగేరి మొక్కను ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో వాగుల్లో, వంకల్లో, నీటి మడుగుల్లో ఈ మొక్క విపరీతంగా పెరుగుతుంది. మడుగులో అడుగు స్థలం కూడా ఖాళీ లేకుండా ఈ మొక్క పెరుగుతుంది. దీనిని పులి చింత ఆకు అని కూడా అంటారు.
ఈ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. దీనిని ఆకు కూరగా వండుకుని తింటారు. వర్షాకాలంలో దీనిని మార్కెట్ లో కూడా అమ్ముతూ ఉంటారు.
కానీ దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి తెలియక చాలా మంది దీనిని కలుపు మొక్కగా భావించి తొలగిస్తూ ఉంటారు. చెంగేరి మొక్కలో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
ఈ మొక్క ఉపయోగాలు తెలిసిన వారు దీనిని తప్పకుండా కూరగా వండుకుని తింటారు. దీనిని ఏవిధంగా ఉపయోగించినా కూడా రక్త స్రావాన్ని, ఉబ్బసాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
చెంగేరి మొక్కను ఉపయోగించి కాలేయ సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. ఈ మొక్కలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ మొక్క దోహదపడుతుంది.
దీనిని కూరగా వండుకుని తినడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా ఉంటామని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చెంగేరి మొక్క ఆకుల రసాన్ని, ఉల్లిపాయ రసాన్ని సమపాళ్లలో కలిపి నుదుటి పై రాసుకోవడం వల్ల ఎంతటి తలనొప్పి అయినా తగ్గుతుంది.
చెంగేరి మొక్కను వేర్లతో సహా సేకరించి నీడకు ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడితో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారడమే కాకుండా దంతాలు, చిగుళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో ఈ పొడిని వేసుకుని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
శరీరంలో వేడిని తగ్గించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. చెంగేరి మొక్క ఆకుల రసంలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. చెంగేరి మొక్క ఆకులను పప్పుగా కూడా చేసుకుని తినవచ్చు.
పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఈ మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఈ రసంలో దోరగా వేయించిన ఇంగువ పొడిని కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.
కూరగా వండుకుని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆకులను నేరుగా తినడం వల్ల నోటి సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. చెంగేరి మొక్క ఆకుల రసాన్ని పెరుగులో కలిపి మజ్జిగలా చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ మొక్కను వేర్లతో సహా సేకరించి శుభ్రంగా కడిగి నేతిలో వేయించుకుని తినాలి. ఇలా చేయడం వల్ల మొలల వ్యాధి తగ్గుతుంది.
గుప్పెడు చెంగేరి మొక్క ఆకులను సేకరించి ఉడికించి వాటిని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల మలబద్దకం సమస్య నివారించబడుతుంది.
చెంగేరి మొక్క సమూలాన్ని పేస్ట్ గా నూరి గాయలపై, పుండ్లపై లేపనంగా రాయడం వల్ల కుళ్లిన పుండ్లు కూడా త్వరగా మానుతాయి.
తేలు కుట్టినప్పుడు ఈ మొక్క సమూల రసాన్ని పైంధవ లవణాన్ని కలిపి తేలు కుట్టిన చోట రాయడం వల్ల నొప్పి, మంట తగ్గుతాయి.
ఈ విధంగా చెంగేరి మొక్కను ఉపయోగించి మనం అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.