దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అలాగే కొత్త హాల్ట్ ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.
ఇదే క్రమంలో చెన్నై నుంచి విజయవాడ వరకూ రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నియోజకవర్గం నరసాపురం వరకూ పొడిగించాలనే డిమాండ్ కూడా వచ్చింది. దీన్ని రైల్వే శాఖ ఆమోదించడంతో ఇవాళ్టి నుంచి చెన్నై-విజయవాడ రైలు కాస్తా నరసాపురం వరకూ ప్రయాణిస్తోంది.
చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నరసాపురం వరకూ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దీని సమయాల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు ఇవాళ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురానికి వెళ్లే నంబర్ 20677 వందే భారత్ రైలు ఉదయం ఐదున్నరకు బయలుదేరింది. ఇది రేణిగుంటకు ఉదయం 7.05కు, నెల్లూరుకు 8.29కి, ఒంగోలుకు 9.43కు, తెనాలికి 11.08కి, విజయవాడకు 11.40కి, గుడివాడకు 12.29కి, భీమవరం టౌన్ కు మధ్యాహ్నం 1.14కు, నరసాపురానికి 2.10కు చేరుకుంది.
అలాగే తిరుగు ప్రయాణంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20678 మధ్యాహ్నం 2.50కి నరసాపురం నుంచి బయలుదేరి, 3.19కి భీమవరం టౌన్, 4.04కి గుడివాడ, 4.50కి విజయవాడ, 5.19కి తెనాలి, 6.29కి ఒంగోలు, 7.39కి నెల్లూరు, 9.50కి రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ 11.45కి చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరనుంది. ఇవాళ్టి నుంచి ఆయా సమయాలు రెగ్యులర్ గా కొనసాగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నరసాపురానికి పొడిగింపు నేపథ్యంలో మారిన సమయాలు, స్టేషన్లను ప్రయాణికులు గమనించాల్సి ఉంటుంది.

































