‘రిగ్గింగ్‌ను అడ్డుకోవాలనే ఏజెంట్‌గా కూర్చున్నా’
ప్రాణం పోయినా.. అరాచకాలను ఎదుర్కొవాలనుకున్నా..వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ చేరెడ్డి మంజుల
ఈనాడు, అమరావతి: ‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ సర్వసాధారణంగా మారింది.
దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. గొడ్డలి వేటు పడి నుదుటిపై తీవ్ర గాయమైనా.. ఒకవైపు నెత్తురోడుతున్నా ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఏజెంట్‌గా కూర్చొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. మంజులను ‘ఈనాడు’ ప్రతినిధి మంగళవారం కలిసినప్పుడు పలు వివరాలు వెల్లడించారు.
‘పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో..ముఖ్యంగా మా రెంటాల గ్రామంలో ఎన్నికలు అంటే రాళ్లు, మారణాయుధాలతో దాడులు చేసుకోవటం, రిగ్గింగ్ ప్రతి ఎన్నికల్లో పరిపాటిగా మారింది. ఆ పరిస్థితి మారాలని, ప్రశాంతంగా ఎవరి ఓటు వారు వేసుకునే వాతావరణం కల్పించాలని ఏజెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ హోటల్ బిజినెస్ చేసున్నాను. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నా. ఆ విషయం ప్రత్యర్థులకు తెలిసింది. ఏజెంట్లుగా ఎవరూ కూర్చోనీయకుండా చేసేందుకు సుమారు 30 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డు మీదకు కత్తులు, గొడ్డళ్లతో చేరుకున్నారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. వైకాపా వర్గీయులు దాడి చేస్తారని, పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని కోరాం. అనంతరం సీఐ ఒకరు ఫోన్ చేసి మీకేం కాదు.. పోలింగ్ కేంద్రానికి బయలుదేరండి.. ఎస్సైని పంపుతానని చెప్పారు. అరగంట వేచి చూసినా పోలీసులు మాత్రం రాలేదు. మాక్ పోలింగ్ టైం అయిపోతుందని ఉదయం 6.30 గంటలకు నా మరిది చేరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తోటికోడలు చేరెడ్డి వీణ తదితరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి బయలుదేరా. మేం రోడ్డెక్కగానే ప్రత్యర్థులు ఒక్కసారిగా మాపైకి కత్తులు, గొడ్డళ్లతో దూసుకొచ్చారు.
మీకు ఎంత ధైర్యం.. ఏజెంట్లుగా కూర్చొంటారా.. అంటూ ఆడ, మగ అనే తేడా లేకుండా దాడి చేశారు. తొలుత చేతులతో నా చెంపలపై కొట్టారు. తర్వాత గొడ్డలితో నుదుటిపై గాయం చేశారు. గాయమై నెత్తురోడుతుంటే మా అబ్బాయి వచ్చి కర్ఛీఫ్ ఇస్తుంటే అతనిపైనా దాడి చేశారు. బైకు ధ్వంసం చేశారు. ప్రాణం పోయినా పరవాలేదనుకొని, నెత్తురోడుతున్న గాయాలతోనే పోలింగ్ కేంద్రానికి వెళ్లా. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే కాంక్షతో ఇలా చేశా. గాయమైందని ఇంటికో.. ఆసుపత్రికో వెళ్లిపోతే.. ఆ గాయాలు మేమే చేసుకున్నామని చెప్పి నెపం మోపుతారు. అందుకే బాధను భరిస్తూ పోలీసులు వచ్చే వరకు పోలింగ్ కేంద్రంలోనే ఉన్నా. పోలీసులు వచ్చాకే గురజాల ఆసుపత్రిలో చేర్పించి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ అరాచకాలకు స్వస్తి పలికేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. తమపై దాడి చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలి. వైకాపా వాళ్లు బలంగా ఉన్న ప్రాంతంలోనే పోలింగ్ కేంద్రాలు ఉండటం వల్లే దాడులు చేస్తున్నారు. ఊళ్లో పోలింగ్ కేంద్రాలను మార్చాలని ఏళ్లుగా మొత్తుకుంటున్నా మా మొర ఆలకించడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం వల్లే వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. తప్పు చేసే వారికి శిక్షలు పడినప్పుడే భయం ఉంటుంది’ అని మంజుల పేర్కొన్నారు.
MLA అరాచకాలపై ఎదురుతిరిగిన ఎమ్మెల్యే బంధువు మంజుల
రెచ్చిపోయి వేట కొడవళ్లతో దాడి చేసిన వైసీపీ మూకలు
నుదుటిపై తీవ్ర గాయమైనా బెదరకుండా బూత్‌లోనే విధులు
గుంటూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకానికి అడ్డూ ఆపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నుదిటిపై పెద్ద గాయమై రక్తమోడుతున్నప్పటికీ ఆమె పోలింగ్ బూత్‌లోనే కూర్చున్నారు. ఆమె పేరు చేరెడ్డి మంజుల. ఎమ్మెల్యే పిన్నెల్లికి వరసకు మరదలు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల గ్రామ వాసి. మంజుల భర్త వెంకటేశ్వరరెడ్డి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. పిన్నెల్లి సోదరుల అకృత్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను చూస్తూ తట్టుకోలేక మార్చి 15న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపు కోసం పాటుపడుతున్నారు. తీరా ఎన్నికలు సమీపించిన తరుణంలో రెంటాల పోలింగ్ బూత్‌లో ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ నేపథ్యంలో మంజుల ఏజెంట్‌గా వున్నారు. సోమవారం ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వైసీపీ మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. మంజుల, ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డిపై వేట కొడవళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని వెంటనే గురజాల ఆస్పత్రికి తరలించారు. మంజుల నుదిటిపై తీవ్ర గాయమై రక్తం ధారగా కారుతున్నప్పటికీ ఆ గాయంతోనే బూత్‌లో ఏజెంట్‌గా కూర్చుని తన కర్తవ్యం నిర్వర్తించారు. చివరకు పార్టీ నేతలు సర్ది చెప్పి మంజులను బయటకు తీసుకొచ్చి వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. మంజుల సాహసం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.