Choclates : పిల్లలకు చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాక్లెట్స్ అంటే వారికి ప్రాణం. షాపుకి తీసుకెళితే కచ్చితంగా చాక్లెట్లు కొనిచ్చే వరకు వదలరు. కొంతమంది పిల్లలు అన్నం తినకుండా అయినా ఉండగలరేమో కానీ, చాక్లెట్లు తినకుండా అస్సలు ఉండలేరు. అంతిష్టం వారికి. అయితే, చాక్లెట్లు ఓ చిన్నారి ప్రాణం తీశాయి. చాక్లెట్స్ తిన్న పాప రక్తం కక్కుకుని చనిపోయింది.
ఈ షాకింగ్ ఘటన పంజాబ్ లో వెలుగుచూసింది. ఇటీవల పంజాబ్ లోని పటియాలలో బర్త్ డే కేక్ తిని బాలిక మరణించిన ఘటన మరువక ముందే.. మరో ఘటన చోటు చేసుకుంది. లుధియానాకు చెందిన ఏడాదిన్నర చిన్నారికి పటియాలలోని బంధువులు చాక్లెట్స్ తో కూడిన గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వచ్చాక బాలిక వాటిని తినింది. అంతే, ఆ కాసేపటికే ఘోరం జరిగింది. పాప రక్తపు వాంతులు చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది. కాగా, ఎక్స్ పైరీ(గడువు తీరిన) చాక్లెట్లు తినడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు.
చనిపోయిన పాప పేరు రబియా. లుథియానాలో ఉంటుంది. పటియాలలో బంధువుల పెళ్లికి వెళ్లింది. అక్కడ రబియా బంధువు ఒకరు స్థానిక షాపులో 300 రూపాయల విలువ చేసే చాక్లట్స్ తో కూడిన గిఫ్ట్ ప్యాక్ కొనిచ్చాడు. తర్వాత చిన్నారి ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకుని లుథియానాలోని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చాక పాప చాక్లెట్స్ తిన్నది. అంతే, ఒక్కసారిగా ఆమె అనారోగ్యానికి గురైంది. రక్తపు వాంతులు చేసుకుంది. దాంతో పాటు విరేచనాలు చేసుకుంది. దాంతో పాప తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. వెంటనే పాపను స్థానికి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. కాగా, గడువు తీరిన చాక్లెట్లు తినడం వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పడంతో అంతా షాక్ కి గురయ్యారు. ఆ గిఫ్ట్ ప్యాక్ ను చెక్ చేయగా.. ఆ చాక్లెట్స్ గడువు దాదాపు 6 నెలల క్రితమే ముగిసినట్లు తెలిసి షాక్ కి గురయ్యారు.
పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే చాక్లెట్స్ ను కొనుగోలు చేసిన షాపుకి వెళ్లారు. అక్కడ శాంపుల్స్ తీసుకుని టెస్టుల కోసం ల్యాబ్ కి పంపారు. హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి నివేదిక వచ్చాక తప్పు ఉందని తేలితే షాపు ఓనర్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గత నెలలో బర్త్ డే కేక్ తిన్న పదేళ్ల బాలిక చనిపోయిన సంగతి తెలిసిందే.