Vizag Child Trafficking: చిన్నారుల అక్రమ రవాణా ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఢిల్లీల్లో చిన్నారుల్ని విక్రయించిన ముఠాలో 17మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పలువురు చిన్నారుల్ని రక్షించారు.పేదరికంలో ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని గుర్తించి వలవేస్తున్నారు.
విశాఖ కేంద్రంగా చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఢిల్లీలో చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి రెండు వేర్వేరు కేసుల్లో 17 మంది నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల నుంచి ఆరుగురు చిన్నారులను రక్షించారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వివరాలను వెల్లడించారు. విశాఖలోని పాండు రంగాపు రంలోని హార్బర్ పార్క్ సమీపంలో ఐదు నెలల ఆడ బిడ్డను విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన శిశువుతో పాటు తొమ్మిది మందిని పోలీసులు ఆగస్ట్ 11న అరెస్టు చేశారు.
కేసు దర్యాప్తులో నిందితులను పోలీసులు విచారించడంతో మరికొంత సమాచారం లభించింది. ఆ సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిపి డెకాయ్ ఆపరే షన్ నిర్వహించారు. శిశువును విక్రయించే ముఠాతో సంబంధాలు ఉన్న గాజు వాక శ్రీనగర్‌కు చెందిన జోడేడ మల్లికార్జునను పిల్లలను కావాలంటూ పోలీసులు సంప్రదించారు.
దీంతో అతను 15 నెలల వయసున్న ఆడశిశువును విక్రయించడానికి తీసుకుని రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.అతడిని విచారించడంతో కడపకు చెందిన ఇద్దరు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి, మరికొందరు కలిసి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీల్లో పిల్లలను విక్రయిస్తు న్నట్టు గుర్తించారు.
ముఠా నెట్‌వర్క్ మూలాలు లోతుగా ఉండటంతో అదనపు బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అనకాపల్లి జిల్లా మార్టూరులో మరో ఆపరేషన్ నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పది నెలల బాబును, చీమలాపల్లిలో చేపట్టిన ఆపరేషన్‌లో మూడేళ్ల వయసున్న బాలికను, పెదనరవలో 20 రోజుల ఆడబిడ్డను రెస్క్యూ చేశారు.
వారితో పాటు ఒడిశాలోని జైపూర్లో తొమ్మిది నెలల బాబుతో పాటు విక్రయానికి సిద్ధంగా ఉంచిన మరో ఇద్దరినీ పోలీసులు రక్షించారు. శిశు విక్రయాల ముఠాతో సంబంధం కలిగిన ఎనిమిది మందిని గాజువాక పోలీసులు ఆరెస్టు చేశారు. ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు.
ఈ ముఠాల మూలాలు మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిని గుర్తించేందుకు అయా రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించి దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. త్వరలోనే మరికొందరు శిశువులు లభించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు దొరికిన నిందితులను విచారిస్తే మరికొంత సమాచారం లభించే అవకాశం ఉందన్నారు.