సైబర్‌ హ్యాకర్ల సైన్యం తయారు చేస్తున్న చైనా..! ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకునేలా

చైనా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడానికి సైబర్ హ్యాకింగ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది. అంతర్జాతీయ హ్యాకింగ్ పోటీలను నిషేధించి, తమదైన హ్యాకింగ్ పోటీలను నిర్వహించి, నైపుణ్యమున్న హ్యాకర్లను గుర్తిస్తోంది. ఈ హ్యాకర్ల ద్వారా ఇతర దేశాల టెక్నాలజీ వ్యవస్థలను నియంత్రించడం చైనా లక్ష్యం.

ప్రపంచానికి పెద్దన్న కావాలని అమెరికాకు పోటీగా చైనా కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అన్ని విషయాల్లో అమెరికాకు గట్టి పోటీ ఇవ్వగల దేశం చైనానే. భవిష్యత్తులో ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలంటే.. కేవలం యుద్ధాలు, బాంబులు, ఆయుధాలతో పని కాదు. ఎందుకంటే.. టెక్నాలజీ కారణంగా ప్రపంచం ఒక కుగ్రామమైపోయింది. ఏ దేశంపై బాంబు పడినా.. అది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే యుద్ధం లేకుండానే ఇతర దేశాలను కంట్రోల్‌ చేసే ఒక సరికొత్త ఆయుధం కోసం అగ్రరాజ్యాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ విషయంలో చైనా ఒక అడుగు ముందే ఉంది. పెరుగుతున్న టెక్నాలజీని తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే.. హ్యాకింగ్‌ ఒక ఆయుధంగా చైనా భావిస్తోంది. భవిష్యత్తులో ఈ హ్యాకింగ్‌ అనే ఆయుధంతోనే ప్రపంచాన్ని తన గుప్పింట్లో ఉంచుకోవాలని ఒక పెద్ద సైబర్‌ హ్యాకర్ల సైన్యాన్ని తయారు చేస్తోంది.


భవిష్యత్తులో ప్రతి దేశం ప్రతి అవసరానికి టెక్నాలజీపైనే ఆధారపడాలి. వారి టెక్నికల్‌ వ్యవస్థలను తమ హ్యాకింగ్‌ పరిధిలో ఉంచుకుంటే.. తాము చెప్పినట్లు ఆ దేశాలు వింటానే లక్ష్యంతో చైనా హ్యాకర్ల ఆర్మీని తయారు చేస్తోంది. అందులో భాగంగా.. తమ దేశంలోని సైబర్‌ సెక్యూరిటీ హ్యాకర్లు ప్రపంచ వేదికలపై జరిగి హ్యాకింగ్‌ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. పైగా దేశవ్యాప్తంగా తమ దేశస్థుల మధ్య హ్యాకింగ్‌ పోటీలు నిర్వహిస్తూ.. నిపుణులను జల్లెడ పడుతోంది. 2017లో చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్విహూ 360 వ్యవస్థాపకుడు జౌ హోంగీ అంతర్జాతీయ హ్యాకథాన్‌లలో చైనా భాగస్వామ్యాన్ని బహిరంగంగా విమర్శించారు.

2018 నుండి చైనీయులు అంతర్జాతీయ హ్యాకథాన్‌లలో పాల్గొనకుండా నిషేధం విధించారు. అదే సంవత్సరం చైనా టియాన్‌ఫు కప్ అని పిలువబడే దాని స్వంత హ్యాకింగ్ టోర్నమెంట్‌ను ప్రారంభించింది. విజేతలకు మిలియన్ డాలర్ల బహుమతులు అందించింది. ఆ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దేశాలు పాల్గొనే ప్రఖ్యాత హ్యాకింగ్‌ పోటీల టోర్నమెంట్‌ Pwn2Ownలో లభించిన బహుమతి డబ్బు కంటే దాదాపు రెట్టింపు. టియాన్‌ఫు కప్ సమయంలో పాల్గొనేవారు ఎక్కువగా చైనీస్ టీమ్స్‌ ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, గూగుల్ ఫోన్‌లు, మైక్రోసాఫ్ట్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేశారు. అంతర్జాతీయ హ్యాకథాన్‌లలో దోషాలను సాఫ్ట్‌వేర్ లేదా పరికరాలను తయారు చేసే కంపెనీలకు వెల్లడిస్తారు, తద్వారా క్రిమినల్ హ్యాకర్లు వాటిని దోపిడీ చేసే ముందు వాటిని సరిదిద్దవచ్చు. కానీ చైనాలో పోటీదారులు ముందుగా ప్రభుత్వానికి తాము కనిపెట్టిన బగ్‌లను నివేదించాలి. అలా చేయకుండా కఠిన శిక్షలు ఉంటాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.