హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు
కీలకపత్రాలు, దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు
ఆధారాల ధ్వంసం, నేరపూరిత కుట్ర, చోరీ అభియోగాలపై కేసు
ఈనాడు-అమరావతి, హైదరాబాద్: జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు సూత్రధారులుగా గత ఐదేళ్లుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది. ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ.. కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు పెట్టింది. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్ 120బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. గురువారం రాత్రి ఈ కేసు నమోదు కాగా… శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సీఐడీ బృందాలు హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేశాయి. వైకాపా హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు, వారి సన్నిహితులు కలిసి… మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.
ప్రశ్నిస్తే హడావుడిగా పారిపోయారు..
‘‘ఈ నెల 6న విజయవాడ ప్రసాదంపాడులోని సాయివిహార్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఏపీఎస్‌బీసీఎల్ కార్యాలయం నుంచి ఓ వ్యక్తి కొన్ని దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, పత్రాల్ని తీసుకొచ్చి ‘ఏపీ39 ఎన్‌క్యూ 6666’ నంబరు వాహనంలో లోడింగ్ చేయడం చూశాను. రాష్ట్రంలో అధికారమార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాల్ని మాయం, ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతనంగా తరలిస్తున్నట్లు అక్కడ పరిస్థితులను బట్టి నాకు అనుమానం కలిగింది. ఆ పత్రాలను దొంగిలించి తీసుకెళ్తున్న వ్యక్తిని ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వకుండా హడావుడిగా కారు డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత స్థానికుల్ని ఆరాతీస్తే కారులో పత్రాల్ని తీసుకెళ్లి పారిపోయిన వ్యక్తి ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అని తెలిసింది. దీనిపై తొలుత నున్న పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా. కానీ వారు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలి’’ అంటూ గద్దె శివకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుచేసిన సీఐడీ ఉన్నతాధికారులు.. సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని కర్నూలు సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులును ఆదేశించారు.
హైదరాబాద్‌లోని నివాసంలో విస్తృత సోదాలు
హైదరాబాద్ నానక్‌రాంగూడలోని మైస్కేప్ కోర్ట్‌యార్డ్ గేటెడ్ కమ్యూనిటీలో 41వ నంబరు విల్లాలో నివసిస్తున్న వాసుదేవరెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలోనే సీఐడీ అధికారులు చేరుకున్నారు. డీఎస్పీ నేతృత్వంలో మూడు వాహనాల్లో వచ్చిన బృందాలు.. తొలుత నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు చేరాయి. అక్కడి నుంచి నలుగురు పోలీసులను వెంట తీసుకొని వాసుదేవరెడ్డి ఉంటున్న విల్లాకు చేరుకున్నాయి. ఆ సమయంలో వాసుదేవరెడ్డి ఇంట్లోనే ఉండడంతో ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఆయన ఇంటినుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాత్రి పొద్దుపోయేవరకూ సోదాలు, విచారణ కొనసాగాయి.
వైకాపా నేత విల్లాలో నివాసం?
వాసుదేవరెడ్డి నివసిస్తున్న విల్లా సైతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైకాపా నేతదేనని సమాచారం. కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసిన అభ్యర్థికి చెందిన విల్లాలోనే వాసుదేవరెడ్డి ఉంటున్నట్లు అక్కడి సిబ్బంది మీడియాకు వెల్లడించారు. అయితే ఆయన అద్దెకు ఉంటున్నారా.. కొన్నారా అనే అంశంపై స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా నేతలతో అంటకాగిన వాసుదేవరెడ్డిపై ఏప్రిల్‌లో ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి తెలిసిందే.