Cinnamon Water: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మసాలా దినుసులు కీలకమైనవి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మసాలా దినుసుల వినియోగం ఎక్కువ.
వివిధ రకాల మసాలా దినుసులు ప్రతి వంటింట్లో తప్పకుండా ఉంటాయి. వీటిలో అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కతో కలిగే ప్రయోజనాలు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం.
ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే దాల్చిన చెక్కను కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యరీత్యా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్కలో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఆధునిక జీవన విధానంలో ప్రధాన సమస్యగా మారిన అధిక బరువుకు చెక్ చెప్పేందుకు దాల్చినచెక్క నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలోని కొవ్వును సులభంగా కరిగించే మూలకాలు ఇందులో ఉంటాయి. స్థూలకాయం లేదా అధిక బరువు సమస్యతో బాధపడేవారికి దాల్చిన చెక్క నీళ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. శరీరంలో పేరుకున్న కొవ్వు వేగంగా కరుగుతుంది.
ముందుగా దాల్చిన చెక్కల్ని పౌడర్ చేసుకుని భద్రపర్చుకోండి. రోజూ ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాసు నీటిలో మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ నీళ్లను చల్లార్చి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం మెటబోలిజం కూడా వృద్ధి చెందుతుంది. రోజూ క్రమం తప్పకుండా దాల్చిన చెక్క నీరు లేదా కషాయం తాగడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. కనీసం నెలరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం గమనించవచ్చు.
దాల్చినచెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలోని మలినాలు బయటకు తొలగిపోతాయి. ఎలాంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాకుండా మెటబోలిజం వృద్ధి చెందడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. స్ఖూలకాయం సమస్యకు చెక్ చెప్పవచ్చు. అయితే వారం పదిరోజులు వాడితే సరిపోదు. కనీసం 6-8 వారాలు వాడిన తరువాతే ఫలితాలు చూడవచ్చు.
దాల్చినచెక్కను యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగిస్తారు. ఆర్ధరైటిస్, పంటి నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మెదడు ఉత్తేజితమౌతుంది. సీజనల్ ఫ్లూ, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయజనింగ్ వంటి సమస్యలు దూరమౌతాయి. రోజూ దాల్చినచెక్క నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.