తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలలో బాలికలను మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఘటన వైరల్ వీడియోతో బయటపడింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడి ఉన్నారు. అయితే, ఇటువంటి సంఘటనలు విద్యారంగాన్ని దెబ్బతీస్తున్నాయి. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం అవసరం.
ప్రైవేట్ స్కూల్స్‌కు పంపించే స్థోమత లేక, తమ పిల్లలు ఎలాగైనా చదువుకోవాలని, చాలా మంది పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కాయకష్టం చేసుకుంటూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కు పంపిస్తున్నారు. మేం ఎండలో పనికి వెళ్లినా.. మా పిల్లలు స్కూల్‌కు వెళ్లి చక్కగా చదువుకొని, వృద్ధిలోకి వస్తారని అనుకుంటుంటే.. కొంతమంది టీచర్లు పిల్లలతో చేయించకూడని పనులు చేయిస్తున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలిక చేత పురుష టీచర్లు వాడే టాయిలేట్లను శుభ్రం చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల పరిస్థితి ఇదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల చేత అందులోనూ అమ్మాయిల చేత మూత్ర శాలలు శుభ్రం చేయించడంపై మండిపడుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లాలోని తంతోండ్రిమలై పంచాయతీ యూనియన్ పరిధిలోని పులియూర్ కాళిపాలయంలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. 5వ తరగతి విద్యార్థులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. తదుపరి విచారణ జరిగే వరకు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు కరూర్ ముఖ్య విద్యా అధికారి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ పోస్టూ చేస్తూ ఖండించారు. “కరూర్ జిల్లాలోని తంతోండ్రిమలై పంచాయతీ యూనియన్ పరిధిలోని పులియూర్ కాళీపాలయంలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో బాలికలు టాయిలెట్లు శుభ్రం చేస్తున్న షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇదేనా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘విద్యా నమూనా’? అందుకే ఆయన NEPని వ్యతిరేకిస్తున్నారా? DMK క్యాడర్ నడుపుతున్న స్థానిక పాఠశాలలు ఆడిట్‌ల నుండి తప్పించుకుని నిధులు దోపిడీ చేస్తారు? ఇది సిగ్గుచేటు,” అని మాల్వియ పోస్ట్ చేశారు.