స్కూళ్ల మూసివేత కోడి ముందా.. గుడ్డు ముందా అన్నట్లుంది: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదోతరగతిలో 10/10 జీపీఎస్‌ సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిభాపురస్కారాలు అందజేశారు. రవీంద్రభారతిలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందేమాతరం ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదు.. విద్యార్థుల్లేరని బడులు మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే.. విద్యార్థులు రారు.. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్‌ టీచర్‌ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి కొనసాగింది. కొన్ని బడుల్లో విద్యార్థుల కన్నా టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే తక్షణమే 11వేల పైచీలుకు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. సింగిల్‌ టీచర్‌ బడుల్ని మూసేయడానికి వీల్లేదని, తండాలు, గూడేల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం ద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం’’ అన్నారు.


ప్రభుత్వ బడి విలువేంటో నాకు తెలుసు
‘‘వందేమాతరం ఫౌండేషన్‌కు అభినందనలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని ప్రోత్సహించడం అభినందనీయం. ప్రభుత్వ బడుల్లో టాపర్లను నిజానికి ప్రభుత్వమే సన్మానించాలి. మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థులు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లలో 90శాతం మంది ప్రభుత్వ బడుల్లోనే చదివారు. చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు సైతం ప్రభుత్వ బడుల్లోనే చదివినవారే. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చుపెడుతోంది. ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధికశాతం టీచర్ల వేతనాలకే పోతోంది. డీఎస్సీ ద్వారా త్వరలో 11వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలి. పిల్లలను చేర్పించకపోతే.. పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు వాటి విలువ బాగా తెలుసు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారికే ఇచ్చి నిధులు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించాం. రూ.2వేల కోట్లు.. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు కేటాయించాం’’ అన్నారు.

అమ్మఒడే తొలి బడి
‘‘ప్రతి విద్యార్థికీ అమ్మఒడే తొలి పాఠశాల. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చిన్న చిన్న పిల్లల్ని చేర్పించడం ద్వారా వారిని అమ్మఒడికి దూరం చేస్తున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధబాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక నివేదిక తెలిపింది. ఇదో సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. గతంలో ఒకే సిలబస్‌ను ఏళ్ల తరబడి అమలు చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చలేదు. ఇకపై విద్యా కమిషన్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్‌ మారుస్తాం. విలువైన సూచనలు ఎవరు చేసినా తప్పక పాటిస్తాం. ఇప్పుడు 10/10 జీపీఎస్‌ వచ్చిన విద్యార్థులు మళ్లీ ఇంటర్‌లోనూ బాగా రాణించాలి. ప్రతి ఒక్కరూ డాక్టర్లుగా, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, మాజీ ఏజీ ప్రకాశ్‌ రెడ్డి, టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన, వందేమాతరం ఫౌండేషన్‌ నిర్వాహకులు రవీందర్‌తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.