ఏపీ ప్రజలను కొద్దిరోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది.ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, మన్యం, అల్లూరి సీతారామరాజు , ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని సంస్థ వెల్లడించింది.
రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. భారీవర్షానికి కూడా అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వడగాడ్పులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వానలు కాస్తంత ఊరటను కల్పించబోతున్నాయి. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తప్పనిసరిగా గొడుగు ధరించి బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలో పూర్తిచేసుకోవాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల్లోపు బయటకు వెళ్లొద్దని, వైద్యుల సలహాలు పాటించాలని, దాహం వేయకపోయినా తరుచుగా నీరు తాగుతుండాలని తెలియజేస్తున్నారు.