రైతులకు CM చంద్రబాబు భారీ గుడ్ న్యూస్..
రైతులకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ, జలవనరుల శాఖలపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక, సాగునీటి విడుదలపై రెండు శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని.. వ్యవస్థలు అన్నీ మళ్లీ గాడిన పడాలని సూచించారు.
ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతులకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన పాత పంటల బీమా విధానాన్ని మళ్లీ తీసుకొస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే.. పంటల బీమా విధానం కింద రైతులకు ప్రభుత్వమే ఆర్ధిక సహయం అందిస్తోంది. ఈ విధానాన్నే మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని తాజాగా చంద్రబాబు అనౌన్స్ చేశారు. సీఎం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.