Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి అందరికీ ఆదర్శం: నందమూరి బాలకృష్ణ

www.mannamweb.com


హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరికీ ఆదర్శమని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.

బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కొరిన వెంటనే ఆయన అంగీకరించారని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ సీఎం ఎన్.టి.రామారావు దూరదృష్టి కలిగిన వ్యక్తి అని… ఆయన మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని గుర్తు చేశారు. గతంలో బండలతో నిండిన ఈ స్థలంలో బసవతారక ఆసుపత్రి నిర్మించారని.. రోగులకు మంచి సేవలు అందుతున్నాయన్నారు. భారత ప్రధానిగా అటల్ బిహారి వాజ్‌పేయ్ రూ.6 కోట్లు మంజూరు చేసి ఈ ఆసుపత్రి బలోపేతానికి దోహద పడ్డారని నందమూరి బాలకృష్ణ వివరించారు. ఇంత గొప్ప ఆసుపత్రికి చైర్మన్‌గా పని చేయడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసి కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం బసవతారకం ఆసుపత్రి ప్రారంభించనున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గుర్తు చేశారు.