తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలతో పాలనలో దూకుడుగా ముందుకు సాగుతోంది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలానే తమ పాలనలో ప్రజా సంక్షేమ నిర్ణాయలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తోన్న కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్లెం వేయడాని రెడీ అయ్యింది రేవంత్ సర్కార్. ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురాబోతుంది. ఆ వివరాలు..
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయ్యింది. కార్పొరేట్ కాలేజీల్లో పెరుగుతున్న ఫీజులపై తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ సర్కార్. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేయడంతో గతంలో.. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఫీజుల అంశంపై గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని.. సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. దాంతో తల్లిదండ్రుల ఆశలన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉన్నాయి. వారి విన్నపం మేరకు కాంగ్రెస్ సర్కార్ ఫీజుల దోపిడికి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాలయాలపై దృష్టి సారించింది. అనుమతులు లేకుండా కొనసాగుతోన్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు చేపట్టడమే కాకుండా.. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచాంర.
అయితే.. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ నడుస్తుండటంతో ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. దాంతో ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశమై ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయి చట్టం చేసి.. అది అమల్లోకి వచ్చే సరికి అడ్మీషన్లు పూర్తయిపోయి తరగతులు కూడా ప్రారభమవుతాయంటూ వాపోతున్నారు.