ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్.. సీఎం సంచలన ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలోని అన్ని వర్గాల్లోని మహిళలకు ఏకంగా 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. బీహార్ శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు..

త్వరలోనే జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నేతలు తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం సంచలన ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలోని అన్ని వర్గాల్లోని మహిళలకు ఏకంగా 35 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాలలో బీహార్‌ శాశ్వత నివాసితులైన మహిళలకు ప్రత్యేకంగా 35% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని స్థాయిలు, విభాగాల్లోని ప్రభుత్వ సేవలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బీహార్‌లో అధిక మంది మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించి పరిపాలనలో పెద్ద పాత్ర పోషించేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని సీఎం నితీష్‌ తెలిపారు. పాట్నాలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


యువతకు తమ ప్రభుత్వ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ‘బీహార్ యువజన కమిషన్’ ఏర్పాటు చేస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఇది రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త చట్టబద్ధమైన సంస్థని స్పష్టం చేశారు. బీహార్ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి, సమర్థులుగా మార్చడానికి బీహార్ యువజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపినట్లు ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని యువత అభ్యున్నతి, సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలపై బీహార్ యువజన కమిషన్ ప్రభుత్వానికి సలహా ఇస్తుందన్నారు. యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటుందన్నారు.

ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు వైస్-చైర్‌పర్సన్‌లు, ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరందరూ 45 ఏళ్లలోపు వారే. రాష్ట్రం వెలుపల చదువుతున్న, ఉద్యోగం చేస్తున్న బీహార్ విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ రాష్ట్రంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించేలా కూడా ఇది పర్యవేక్షిస్తుందని బీహార్ యువజన కమిషన్ విధివిధానాల గురించి వివరించారు. అలాగే మద్యం, మాదకద్రవ్య దుర్వినియోగం వంటి సామాజిక దురాచారాల అరికట్టడంలోనూ ఈ కమిషన్‌ బాధ్యత వహిస్తుంది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.