Cockroach : బొద్దింకలు.. వీటిని చూడగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. ఈ బొద్దింకలు మనకు అప్పుడప్పుడూ ఇంట్లో కనబడుతూనే ఉంటాయి. అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి.
బొద్దింకల కారణంగా మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనం వంట చేసుకునే ప్రాంతాలలో ఇవి ఎక్కువగా తిరగడం వల్ల ఆహారం విషతుల్యం అవడం, వాంతులు, కడుపు నొప్పి, నీళ్ల విరేచనాల వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. కనుక సాధ్యమైనంత వరకు మన ఇంటి పరిసరాలలో, ఇంట్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి.
మనకు బొద్దింకలను నివారించే అనేక రసాయన ఉత్పత్తులు మార్కెట్‌లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం బొద్దింకలను నివారిచుకోవచ్చు. కానీ వీటి తయారీలో రసాయనాలను ఎక్కువగా వాడతారు. కనుక వీటిని తగిన జాగ్రత్తలు తీసుకుని వాడాల్సి ఉంటుంది.
అయినప్పటికీ మనం ఒక్కోసారి వాటి విష ప్రభావానికి గురవుతూ ఉంటాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు ఈ రసాయనాలతో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లో నుండి బొద్దింకలను తరిమేయవచ్చు. బొద్దింకలను నివారించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్న చోట నాలుగు బిర్యానీ ఆకులను ఉంచడం వల్ల లేదా ఆ ఆకులను పొడిగా చేసి చల్లడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని బొద్దింకలు తిరిగే చోట చల్లడం లేదా స్ప్రే చేయడం వల్ల కూడా బొద్దింకలు నివారించబడతాయి. మనం ఆహారంగా తీసుకునే దోసకాయను ముక్కలుగా చేసి ఇంట్లో అక్కడక్కడా ఉంచడం వల్ల కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి.
అలాగే కోడిగుడ్డులోని పచ్చ సొనలో బోరిక్ యాసిడ్ ను కలిపి బొద్దింకలు తిరిగే చోట ఉంచాలి. ఈ మిశ్రమాన్ని తిని బొద్దింకలు చనిపోతాయి. మిరియాలను, వెల్లుల్లి రెబ్బలను, ఉల్లిపాయలను పేస్ట్ గా చేసి ఆ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.
ఈ చిట్కాలను పాటించడంతోపాటు ఇంటిని, ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. వంట గదిలో తేమ లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఉంటాయి.