వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అవ్వాలిఅలాంటి వ్యవస్థను ఏర్పాటుచేస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్టహైడ్రా, ఈగల్ తరహాలో ట్రాఫిక్‌కు ప్రత్యేక వ్యవస్థ: సీఎం
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు వేయగానే, వారి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం ఆటోమెటిక్‌గా చెల్లింపు జరిగిపోయేలా సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మైనర్లు వాహనాలు నడపటం, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. సోమవారం యూస్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అరైవ్-అలైవ్ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రసంగించారు. ‘నిబంధనలు ఉల్లంఘించేవారికి పోలీసులు చలానాలు వేస్తున్నారు. కానీ, సంవత్సరం తర్వాత డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. ఎలాగో తగ్గిస్తున్నారు కదా అని మళ్లీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మొదట వాహనాలకు చలానా వేయకుండానే అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితుల్లో చలానా వేస్తే ఒక్క పైసా కూడా తగ్గించకండి. వాహనదారుడి బ్యాంకు అకౌంట్‌ను ట్రాఫిక్ పోలీస్ విభాగానికి అనుసంధానం చేసి చలానా వేయగానే ఆటోమెటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి జరిమానా కట్ అయ్యేవిధంగా ఏర్పాటుచేయాలి. అప్పుడే ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయి. వాహనం రిజిస్ర్టేషన్‌కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని బ్యాంకు ఖాతాను తీసుకోవాలి. ఇందుకోసం బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలి’ అని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రాథమిక విద్య స్థాయిలోనే అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు.
రోడ్డు ప్రమాద మరణాలు హత్యలే..
మనుషుల తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలను హత్యలుగానే చూడాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సరిహద్దుల్లో యుద్ధంలోకంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ‘మనం తప్పు చేయకపోయినా ఎదురుగా వచ్చేవాళ్ల తప్పుల వల్ల మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణాలు మైనర్లకు వాహనాలు ఇవ్వటం, డ్రంకెన్ డ్రైవ్‌లే’ అని సీఎం తెలిపారు. హైడ్రా, ఈగిల్ తరహాలో రోడ్డు భద్రతా విభాగాన్ని ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటుచేసి, దానికి డీజీ లేదా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. నేడు సైబర్ నేరాలు కూడా ప్రధాన సమస్యగా మారాయని అన్నారు. సైబర్ నేరాలతోపాటు డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెరువులు, కుంటలను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకోవటంతో చిన్న వర్షాలకే వరదనీరు కాలనీల్లోకి, రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని సీఎం విమర్శించారు. ఇలాంటి కబ్జాలను విడిపించేందుకే హైడ్రాను తీసుకొచ్చినట్లు చెప్పారు.
ప్రమాద కారకుల లైసెన్సుల రద్దు: పొన్నం
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాంటివారు కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి లేకుండా నిషేధం విధించాలని అభిప్రాయపడ్డారు. రహదారి భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్- అలైవ్ కార్యక్రమం కేవలం ఒక అవగాహన కార్యక్రమం కాదని, ఇదొక సామాజిక ఉద్యమం అని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.


































