ఆంధ్రప్రదేశ్లో మాత్రం తమ క్షుద్బాధ ను తీర్చుకోవడంలో అధికారులు ఏకంగా 1.2 కోట్లు చెల్లించారు. విజయవాడలోని వెలగపూడి లో ఉన్న సచివాలయంలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాలకు హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, వారి సహాయక సిబ్బంది భోజనాలకు ఏకంగా 1.2 కోట్లు ఖర్చయింది..
వెలగపూడి సచివాలయంలో ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఏఎస్, ఐపీఎస్, వారి సహాయక సిబ్బంది, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. దీనికోసం భోజనాలు ఏర్పాట్లు చేశారు.. అయితే ఈ భోజనాలను సరఫరా చేయడానికి టెండర్లను పిలుస్తుంటారు. అయితే అటువంటి విధానం లేకుండా నామినేషన్ పద్ధతిలో భోజనాలను సరఫరా చేసే బాధ్యతను ఓ ప్రముఖ హోటల్ కు కట్టబెట్టారు.. రెండు రోజులపాటు ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ కోసం ఒక్క రోజుకు 60 లక్షలు చొప్పున చెల్లించారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 300 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇతర సహాయక సిబ్బంది మొత్తం కలుపుకొని 1200 మంది దాకా హాజరై ఉంటారని తెలుస్తోంది. అయితే సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయలేదు. కేవలం మీడియా ప్రతినిధులకు మాత్రమే భోజనాలు ఏర్పాటు చేయగా.. వారు అక్కడే తమ ఆకలి తీర్చుకున్నారు.. అయితే భోజనాల సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఓ ప్రముఖ హోటల్ కు అప్పగించడం వివాదాస్పదమైంది.
సెవెన్ స్టార్ హోటల్ రేట్లు
కాన్ఫరెన్స్ లో ఎలాంటి ఆహారం అందించారనే విషయాన్ని ఎవరూ బయటికి చెప్పకపోయినప్పటికీ.. ఒక్కో ప్లేట్ 3,200 ధరతో అందించాలని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రోటోకాల్ అధికారులు కూడా చెబుతున్నారు. అయితే ఇంత ధర పెట్టి భోజనాల కాంట్రాక్ట్ ఇవ్వడం ఏమిటనే చర్చ జరుగుతోంది. రెండు రోజులపాటు కోటి 20 లక్షలను భోజనాలకు ఖర్చు చేయడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ” రెండు రోజులపాటు ఏం జరిగిందో తెలియదు. ఏం చర్చించారో తెలియదు. అధికారులు మొత్తం సచివాలయం వద్ద ఉన్నారు. రెండు రోజుల్లో రోజుకు 60 లక్షల చొప్పున కోటి 20 లక్షలు భోజనాలకు ఖర్చు చేశారు. దీని ద్వారా ఎలాంటి మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుందో వారికే తెలియాలి. అభివృద్ధి పేరుతో చర్చలు జరిపామని చెప్పారు. ఇంతకీ ఏం అభివృద్ధి చేస్తారో చూడాల్సి ఉందని” వైసిపి నేతలు అంటున్నారు.