జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
పుష్ప సినిమాలోని డైలాగ్స్తో ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టి తగ్గేదేలే, రప్పా రప్పాఅంటూ నినాదాలు చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని తగ్గేదేలే అంటున్నారు. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా కాంగ్రెస్ విజయం ఆపలేకపోయారని విమర్శించారు.
ఆరు రౌండ్లు పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 15వేలకుపైగా మెజార్టీ లభించింది. మొదటి రౌండ్ ఫలితాలు చూస్తే పోటీ హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. కానీ రెండో రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడా తగ్గకుండా జోరు పెంచారు. సమీప ప్రత్యర్థి సునీత ఎక్కడా కోలుకోలేదు. రౌండ్ రౌండ్కు ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ పెంచుకూ వెళ్లారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ సరళిపై పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజాపాలనకు పట్టం కట్టారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళిని తెలియజేస్తోందని తెలిపారు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని పేర్కొన్నారు కంటోన్మెంట్ మాదిరి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారని వెల్లడించారు.
సానుభూతి, BRS డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా మహిళలను సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసిందని పొన్నం అభిప్రాయపడ్డారు. అయిన కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం,రేషన్ కార్డులు పంపిణీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు ,ఉద్యోగ నియామకాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలిచారని అన్నారు. తమ ప్రభుత్వం అన్ని అంశాలు క్షేత్ర స్థాయిలో చేరేలా పని చేస్తున్నామని… ఈ ఫలితం ప్రభుత్వ కార్యక్రమాలకు నిదర్శనమన్నారు.
BRS చేసిన దుష్ప్రచారం పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం మరింత బలంగా పని చేస్తుందన్నారు పొన్నం. ఓడిపోతున్నామని అసహనంతో ప్రతిపక్ష పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు చేసిందన్నారు. వాళ్ళే తమ పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించారని పేర్కొన్నారు. మీ సంగతి చూస్తా అనే మాటలు ఆశ్చర్యం కలిగించిందన్నారు. పోలీసులు మా నాయకులు అక్కడ ఉండవద్దు అని కేసులు పెట్టారని గుర్తు చేశారు. వాళ్ళు అనేక మంది బయట వాళ్ళు ఉన్నారని తెలిపారు. సికింద్రాబాద్ కార్పొరేటర్ అక్కడే ఉండి టీవీ లకు బైట్ ఇచ్చారని వివరించారు. వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అసహనంతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.
ముందు నుంచి చెప్తున్నట్టు బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు అని చెప్పామని పొన్నం గుర్తు చేశారు. కిషన్ రెడ్డి ఎంపీ కేంద్ర మంత్రి BRSతో కుమ్మక్కయ్యారని మరోసారి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కిషన్ రెడ్డి గురుదక్షిణ కింద BRSకి సహకరించారని విమర్శించారు. దీనికి కిషన్ రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, గల్లీలో దోస్తీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకస్తే మంచిదని.. లేకపోతే తెలంగాణ ప్రజలు వారి ఆఫీస్ కి తాళాలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
































