Crime: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం

ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌పై ఒక కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.


బాధితురాలు పటేల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ అస్లాంపై తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

నివేదిక ప్రకారం.. ఇటీవల మహిళా ఎస్ఐ ఒక కొండ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌కి బదిలీ అయ్యారు. సంఘటన జరిగిన రోజు తన డ్యూటీ లొకేషన్ దూరంగా ఉండటంతో, డెహ్రాడూన్‌లోని ఒక హోటల్‌లో బస చేయాలని నిర్ణయించుకున్నానని, కానిస్టేబుల్‌ని ఒక గది బుక్ చేయాలని అడిగానని ఆమె చెప్పింది. హోటల్ చేరుకున్న తర్వాత కానిస్టేబుల్ రూం తనిఖీ చేసే ఉద్దేశంతో లోపలికి వచ్చి, తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. నిందితుడైన కానిస్టేబుల్ తనపై అత్యాచారం చేయడంతో పాటు సంఘటనను వీడియో రికార్డ్ చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది. ఎవరికైనా చెబితే, ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పెడతా అని బ్లాక్‌మెయిట్ చేసినట్లు బాధితురాలు చెప్పింది.

ఘటన తర్వాత మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. విధులకు తిరిగి వచ్చిన తర్వాత కూడా నిందితుడైన కానిస్టేబుల్, ఆ వీడియోను ప్రస్తావిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి, అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డినట్లు తెలుస్తోంది. ఈ అఘాయిత్యం గురించి చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠినమైన అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ కేసుని పర్యవేక్షించే బాధ్యతను రూరల్ ఎస్పీకి అప్పగించినట్లు, సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఆరోపణలు రుజువైతే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.