12 ఏళ్లు ఇంట్లోనే కూర్చుని రూ. 28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్

ధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్ ఉదంతం బయటపడింది. ఈ కేసు 2011లో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారిది.


నియామకం తర్వాత.. అతన్ని భోపాల్ పోలీస్ లైన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆపై సాగర్ శిక్షణా కేంద్రానికి పంపారు. కానీ శిక్షణకు హాజరు కావడానికి బదులుగా, అతను విదిషలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఏ అధికారికి సమాచారం ఇవ్వలేదు లేదా సెలవు కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ తన సర్వీస్ ఫైల్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్‌కు పంపాడు. ఆ ఫైల్ అక్కడికి చేరుకోగానే.. ఎటువంటి దర్యాప్తు లేకుండానే ఆమోదం పొందింది. భోపాల్ పోలీస్ లైన్‌లో ఎవరూ అతని విధులకు రావడం లేదని పట్టించుకోలేదు. దీంతో అతను జీతం పొందుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడూ విధులకు హాజరు కాలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 12 సంవత్సరాలుగా ఏ అధికారి కూడా ఈ అక్రమాన్ని గుర్తించలేకపోయారు.

నివేదికల ప్రకారం.. ఒకే పోలీస్ స్టేషన్లలో చాలా కాలంగా పని చేస్తున్న పోలీసులను బదిలీ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఆదేశించారు. ప్రతి పోలీసు వివరాలను డిజిటలైజ్ చేయాలని అధికారులను కోరారు. దీంతో ఈ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ కానిస్టేబుల్‌ని పిలిపించి ఆరా తీశారు. తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అందువల్ల విధులకు హాజరుకాలేదని పేర్కొన్నాడు. మెడికల్ రిపోర్టును సైతం అందించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను భోపాల్‌లోని టీట నగర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఏసీపీ అంకిత ఖతార్కర్‌కు అప్పగించారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. “కానిస్టేబుల్ ఒంటరిగా శిక్షణకు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. కానీ శిక్షణకు రాలేదు. అతడి హాజరు సైతం నమోదు కాలేదు. ప్రస్తుతం అతడి నుంచి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన మొత్తాన్ని అతని రాబోయే జీతం నుంచి తీసుకుంటాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఆమె వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.