శుక్రవారం కురిసిన వర్షానికి మూసీ నదీ ఉప్పొంగింది. దీంతో ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అక్కడే కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించి స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి కొట్టుకుపోయింది. మరోవైపు చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ రెండు బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఎంజీబీఎస్ పరిస్థితిపై సీఎం ఆరా
మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్‌లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎంజీబీఎస్‌లో పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకి తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
































