హైవే‎పై కంటైనర్ పంచర్.. అనుమానం వచ్చి చెక్ చేయగా షాక్..

www.mannamweb.com


ఏపీ తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం స్మగ్లింగ్ సెంటర్‎గా మారింది. తమిళనాడు నుంచి కుప్పం మీదుగా కర్ణాటకకు ఉన్న రూట్‎లో స్మగ్లింగ్ జరుగుతోంది. స్మగ్లర్ల అక్రమ వ్యాపారం ఈ రాంగ్ రూట్లోనే కొనసాగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగే ఈ రూట్‎లో మూడు రాష్ట్రాల అధికారులు ఎంత నిఘా పెట్టినా స్మగ్లింగ్ దందా మాత్రం తగ్గడం లేదు. ప్రత్యేకించి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు.. తమిళనాడు సీఎం స్టాలిన్‎కు లేఖ రాశారు. అయినా స్మగ్లింగ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కుప్పం, పలమనేరు జాతీయ రహదారిలో తమిళనాడు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు కంటైనర్‎ను సీజ్ చేశారు.

కుప్పం బైపాస్ రోడ్‎లోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ అయిన కంటైనర్‎లో తమిళనాడు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం పట్టుబడింది. కంటైనర్ పంచర్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారిలో ఆగిపోయిన కంటైనర్‎ను గుర్తించిన పోలీసులు అందులో సుమారు 10 టన్నుల బియ్యం ఉందని తేల్చారు. తమిళనాడు రేషన్ బియ్యంగా గుర్తించి కంటైనర్ వాహనాన్ని సీజ్ చేశారు. కంటైనర్ వద్దకు పోలీసులు చేరుకోగానే అక్కడి నుంచి లారీ డ్రైవర్, క్లీనర్‎తో పాటు స్మగ్లింగ్ ముఠా మెల్లిగా జారుకుంది.

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు వయా చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు మార్గంగానే కాకుండా రైళ్లలోను రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా తమిళనాడులోని జోలార్‎పేట నుంచి కర్ణాటకలోని బంగారు పేటకు నిత్యం అక్రమ రవాణా కొనసాగిస్తోంది. రైస్ హబ్‎గా ఉన్న బంగారు పేటకు మూడు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. మదనపల్లి, పలమనేరు నుంచి ముల్బాగల్ మీదుగా బంగారు పేటకు ఒక మార్గంలో, తమిళనాడులోని గుడియాత్తం నుంచి వీకోట మీదుగా కర్ణాటకలోని బంగారు పేటకు రైస్ స్మగ్లింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ మార్గాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచినా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ ముఠా మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటించేందుకు వీలుగా కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఈ దందా కొనసాగిస్తోంది. కిలో రేషన్ బియ్యం కు రూ.2 కమిషన్‎తో ఈ వ్యవహారం నడుస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న రైస్ స్మగ్లింగ్‎కు స్థానిక అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విజిలెన్స్ కూడా గుర్తించింది. మాఫియాగా మారిన రైస్ స్మగ్లింగ్ ముఠాకు రాజకీయ అండదండలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.