అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్న నాసా పర్సెవరెన్స్ రోవర్ ఒక వింత బండరాయిని గుర్తించింది. జెజెరో క్రేటర్ సమీపంలోని వెర్నోడెన్ అనే ప్రాంతంలో కనుగొన్న ఈ 80 సెంటీమీటర్ల (సుమారు 31 అంగుళాల) రాయి, అక్కడి పరిసరాలకు భిన్నంగా ఉండటంతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ రాయికి “ఫిప్సాక్స్‌లా” అని నాసా పేరు పెట్టింది. సెప్టెంబర్ 19, 2025న రోవర్‌లోని మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ఈ చిత్రాన్ని తీసింది.
గత వారం ఈ రాయిని మరింత నిశితంగా పరిశీలించిన మిషన్ బృందం, దీని ఆకారం, పరిమాణం చుట్టుపక్కల ప్రాంతంలోని రాళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని నిర్ధారించింది. రోవర్‌లోని సూపర్‌క్యామ్ లేజర్, స్పెక్ట్రోమీటర్లతో జరిపిన ప్రాథమిక విశ్లేషణలో ఈ రాయిలో ఇనుము, నికెల్ మూలకాలు అధిక సాంద్రతలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా అంగారకుడి ఉపరితలంపై ఈ మూలకాలు అరుదుగా కనిపిస్తాయి. గ్రహశకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్-నికెల్ ఉల్కలలో ఇవి అధికంగా ఉంటాయి. దీన్ని బట్టి ఈ రాయి సౌర వ్యవస్థలో మరెక్కడో ఏర్పడి, అంగారకుడిపై పడి ఉండవచ్చని నాసా భావిస్తోంది.
అయితే, దీన్ని ఉల్కగా అధికారికంగా నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా తెలిపింది. గతంలో క్యూరియాసిటీ రోవర్ 2014లో “లెబనాన్”, 2023లో “కోకో” అనే ఐరన్-నికెల్ ఉల్కలను గేల్ క్రేటర్‌లో గుర్తించింది. జెజెరో క్రేటర్ వద్ద పర్సెవరెన్స్‌కు ఇన్నాళ్లకు ఇలాంటి రాయి కనబడటం శాస్త్రవేత్తలకు ఊహించని పరిణామం.
































