అమరావతి: మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు నిర్వహిస్తోన్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన వస్తోందని ఆయన ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
‘‘నా దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాను. మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నా’’ అని పోస్టు పెట్టారు.
ప్రజా సమస్యలు తెలుసుకుని అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘ప్రజాదర్బార్’ మంగళగిరి ప్రజలకు సాంత్వన కలిగిస్తోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వారికి ఆయన భరోసా కల్పిస్తున్నారు.
మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలతో పాటు పలువురు ఉద్యోగులు, మీ సేవ నిర్వాహకులు వచ్చారు. తమకు న్యాయం చేయాలని మీసేవ నిర్వాహకులు కోరారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఆయా శాఖలకు పంపించేందుకు లోకేశ్ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. వారి ద్వారా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.