మతిపోగొడుతున్న దసరా ఆఫర్లు.. రూ.200కే మేక, మందు, మిక్సీ, బీర్లు! బట్‌ వన్‌ కండీషన్‌..

తెలంగాణలో దసరా సందర్భంగా ఖమ్మం జిల్లాలో రూ.200తో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. మేక మొదటి బహుమతిగా ఉండటంతో ఈ డ్రా వైరల్‌గా మారింది. మిక్సీ, పట్టుచీర, ఫుల్‌ బాటిళ్లు వంటి ఆకర్షణీయ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రజల ఆసక్తిని చూరగొన్న ఈ వినూత్న కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది.

తెలంగాణలో దసరా పండగను ఎంత సంబురంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంతుకమ్మ ఆటపాటలతో ఎంతో వైభవంగా ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు ప్రతి వాడలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇంత విశిష్టత కలిగిన దసరా సందర్భంగా మతిపోగొట్టే మస్తు మస్తు ఆఫర్లు పుట్టుకొస్తున్నాయి. కేవలం రూ.200లకే మేక, మిక్సీ, పట్టుచీర, రెండు ఫుల్‌ బాటిళ్లు, కాటన్‌ బీర్లులో ఏదో ఒకటి పొందేలా లక్కీ డ్రాను రూపొందించారు. లక్కీ డ్రాలో మేకను మొదటి బహుమతిగా ఇవ్వడంతో ఈ లక్కీ డ్రా వైరల్‌ అవుతోంది.


ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో కొంతమంది ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా 200 కొట్టు.. మేకను పట్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ డ్రాలో మొదటి బహుమతిగా 10 కిలోల మేక, రెండో బహుమతిగా మిక్సీ, మూడో బహుమతిగా పట్టుచీర, నాలుగో బహుమతిగా రెండు రాయల్‌ స్టాగ్‌ ఫుల్‌ బాటిల్స్‌, ఐదో బహుమతిగా కాటన్‌ బీర్లుగా ప్రకటించారు. ఇందుకోసం రూ.200లతో కూపన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని కూపన్లు అయినా తీసుకోవచ్చు. దసరా రోజు అంటే అక్టోబర్‌ 1న గోవింద్రాల గ్రామంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద డ్రా తీయనున్నారు. ప్రజలందరి సమక్షంలో ఈ డ్రా తీస్తారు. అందులో విజేతలుగా నిలిచిన ఐదుగురికి ఈ బహుమతులు అందజేయనున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.